బుధవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో రోడ్డు షోలకు, సభలకు అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు చంద్రబాబుకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం కాలినడక చంద్రబాబు తన పర్యటనకు కొనసాగించారు. అయితే కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే టీడీపీ నాయకులకు ధీటుగానే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు జీవో నెం.1 రావటానికి కారణం చంద్రబాబే అంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక ఉన్నాదిలా రొమ్ము విరుచుకొని కుప్పంలో వీరంగాం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై సభలు, రోడ్ షో పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వైసీపీ తో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పోలీస్ చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ను తీసుకువచ్చిందన్నారు. ఇటీవల చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలని రామకృష్ణారెడ్డి అన్నారు. గతం వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని సజ్జల మండిపడ్డారు.
చంద్రబాబు నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు చనిపోయేవారు కాదన్నారు. చంద్రబాబు సభలను పోలీసులు అడ్డుకోలేదని, కేవలం రోడ్డు షోలు, రోడ్లపై సభలు మాత్రమే నిర్వహించ వద్దన్నారని తెలిపారు. అయితే చంద్రబాబే.. ఏం చేస్తారో చేసుకోమని విచ్చలవిడిగా ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఒక ఉన్నాదని, రాజకీయ నటుడని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరి.. చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.