తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంత మంది నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల అల్లరికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. తామే హీరోలం అన్నట్టు రెచ్చిపోతున్నారు.
తాజాగా విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై బైక్ లతో స్టంట్లు చేస్తూ వాహనదారులకు దడ పుట్టిస్తున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొందరు యువకులు దూసుకుపోతూ బైక్ పై నిలబడి పిస్టల్‌తో విన్యాసాలు చేశారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితమైన బైక్ రేసింగ్‌లు… ఇప్పుడు నగరంలోని ప్రధానరహదారులపై నిర్వహిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇప్పుడు ఏకంగా దుర్గగుడి ఫ్లఓవర్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకున్నారు.
పోలీసులకు చిక్కకుండ తమ బైక్‌కు ఉన్న నెంబర్ ప్లేట్ తీసేసి రోడ్లపై స్టంట్లు చేశారు. తాము చేస్తున్న స్టంట్లు సోషల్ మీడియాలో లైకుల కోసం అప్ లోడ్ చేస్తున్నారు. వీరి వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విజయవాడ పోలీస్.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై గస్తీ పెంచారు. గతంలో బైకు రేసింగ్స్ పెరగడంతో.. వారిపై ఫుల్ ఫోకస్ పెట్టి అణచివేశారు పోలీసులు. కానీ యువకులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
తాజాగా ఇద్దరు యువకులు టాయ్ గన్ తో విన్యాసాలు చేశారు. సోషల్ మీడియా వీడియోల ఆధారంగానే పలువురిని గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు. బైక్ రేసులు, విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బైక్ రేసులు, స్టంట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నాం అని అంటున్నారు పోలీస్ అధికారులు.