పాతికేళ్లుగా వినోదరంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఈటీవీ నెట్ వర్క్ ఇప్పుడు చిన్నారుల కోసం రంగుల హరివిల్లును తీసుకువచ్చింది. ‘బాలభారత్’ పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. 12 ఛానళ్లను చిన్నారుల కోసం అందిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ 12 ఛానళ్లను ఒకేసారి ప్రారంభించారు రామోజీ సంస్థల అధినేత రామోజీరావు. తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో బాలభారత్ ప్రసారమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనుసులను గెలుచుకున్న గ్లోబల్ షోలతో పాటు దేశీయ వినోదాన్ని బాలభారత్ ఛానళ్లు అందించనున్నాయి. చిన్నారులను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన కంటెంట్ ని స్థానిక భాషలో అందిస్తూ పిల్లల టెలివిజన్ ప్రపంచాన్నే సరికొత్తగా మార్చేందుకు బాలభారత్ వచ్చింది. జిజ్ఞాసను, ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశాలతో పిల్లల మనసును చూరగొనేలా బాలభారత్ కార్యక్రమాలకు రూపకూల్పన చేస్తోంది. కేవలం వినోదాన్ని అందివ్వడమే కాకుండా చిన్నారులల్లో సంస్కారం, విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తుంది.
అద్బుతమైన కథలు-కారెక్టర్లు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యానిమేషన్, లైవ్ యాక్షన్లతో చిన్నారుల వినోద ప్రపంచం పూర్తిగా మారిపోనుంది.ఈటీవీ బాల బారత్ అన్ని భాషల ఛానెల్స్ కాకున్నా కనీసం కొన్ని భాషల ఛానెల్స్ అయినా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అతి పెద్ద టీవీ నెట్వర్క్ ఉన్న ఈటీవీ మరో 12 చానెల్స్ ను ప్రారంభించడం అభినందించాల్సిన విషయం.