పిల్లల పేరు మీద ఆస్తులు కొంటున్నారా? వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? ఐతే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలే తమ ఆస్తిగా భావిస్తుంటారు. వారి కోసం, వారి భవిష్యత్తు కోసం రేయనక, పగలనక కష్టపడుతుంటారు. పిల్లలకు మంచి చదువు అందించాలని తాపత్రయపడుతుంటారు. తనలా తన పిల్లలు కష్టపడకూడదని ఆస్తులు కూడబెడుతుంటారు. పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. పాలసీలు కడుతుంటారు. చిట్టీలు వేస్తుంటారు. ఒక స్థలం కొని వారి పేరు మీద రిజిస్టర్ చేయిస్తుంటారు. అయితే ఎన్ని చేసినా పిల్లల కోసమే చేయాలి గానీ పిల్లల పేరు మీద చేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. పిల్లల కోసం ఏదైనా చేయడానికి, పిల్లల పేరు మీద ఏదైనా చేయడానికి చాలా తేడా ఉంది.
ఉదాహరణకు రామారావు అనే వ్యక్తికి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు ఉన్నారు. కూతురు పుట్టిన తర్వాత కలిసి వచ్చిందని ఆమె పేరు మీద ఒక స్థలం కొన్నాడు. కూతురు పేరు మీదనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు, కూతురిని ఇద్దరినీ బాగా చదివించాడు. అప్పు చేసి మరీ చదివించాడు. వీరికి ఉన్నది ఒకే ఒక ఆస్తి, అది కూడా కూతురి పేరు మీద ఉన్నది. ఒకరోజు కూతురి పెళ్లి సమయం వచ్చింది. అప్పు చేసి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ అప్పు తీర్చడానికి రామారావు కష్టపడ్డాడు. మరొకవైపు కొడుకు చదువు కోసం డబ్బు అవసరం పడింది. కొడుకు ఉన్నత విద్య కోసం, విదేశాలకు పంపడానికి డబ్బు కావాలంటే కూతురి పేరు మీద ఉన్న స్థలం అమ్మి తీరాలి. ఆ విషయం కూతురికి చెప్తే సరే అన్నది. కానీ ఆమె భర్త, అత్తమామలు అడ్డు చెప్పారు.
నా భార్య పేరు మీద ఉన్న ఆస్తి అమ్మే హక్కు మీకెక్కడిది అని భర్త.. మా కోడలు పిల్ల ఆస్తితో మీకేంటి పని అని అత్తమామలు రామారావు మీద గొడవకు దిగుతారు. ఇప్పుడు రామారావు పరిస్థితి ఏంటి? పాపం తండ్రికి, తోడబుట్టిన సోదరుడికి అవసరం తీర్చాలని కూతురు అనుకున్నా మెట్టింటి వారు ఒప్పుకోవడం లేదు. గట్టిగా అడిగితే కూతురు పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్టు అవుతుందని తండ్రి సైలెంట్ అయిపోయాడు. నా పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించావు నాన్న అని కూతురు అడిగినా ప్రయోజనం లేదు. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడెలా అని తల బాదుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఉన్న కొంచెం ఆస్తి కూతురి పేరు మీద పెట్టి తప్పు చేశానా, కొడుకుకి న్యాయం చేయలేకపోయినా అని రామారావు బాధపడ్డాడు.
కొడుకు చదువు ఆగిపోయింది. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలన్న కొడుకు కల కలగానే మిగిలిపోయింది. నాన్న జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇది ఒక రామారావు విషయంలోనే కాదు, అనేక మంది తండ్రుల విషయంలో జరుగుతుంది. తెలిసో, తెలియకో పిల్లల పేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేయడం, పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు కట్టడం చేస్తుంటారు. ఇలా చేయడం సరైన పని కాదని చెబుతున్నారు. పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు కట్టినా హక్కుదారు తండ్రే ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో ఆపదొచ్చినా, అవసరమొచ్చినా వాటి మీద పూర్తి హక్కులు తండ్రికే ఉంటాయి. కూతురు విషయంలోనే కాదు, కొడుకు విషయంలో అయినా ఇలానే ఉండాలి. మైనర్ గా ఉన్నా, మేజర్ గా ఉన్నా పిల్లల పేరు మీద, ముఖ్యంగా కొడుకు పేరు మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడం అనేది సరైన పని కాదని నిపుణులు అంటున్నారు. కొడుకు ఆస్తి పట్టుకుని వెళ్ళిపోతే.. తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తే.. అమ్మేసి పోతే కన్న పాపానికి మీరెక్కడ ఉంటారు. అందుకే మీ పేరు మీదనే ఉండాలి.
చదువులు, పెళ్లిళ్లు, వాటికైనా అప్పులు అన్నీ తీరిపోయాక, అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత పిల్లల పేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం ఉంటేనే ఈగలు వాలతాయి. డబ్బుంటేనే పిల్లలు చూస్తారు. ఇది జగమెరిగిన సత్యం. పిల్లలు మంచోళ్ళయితే సంతోషమే. కానీ కీడెంచి మేలు ఎంచమన్నారు. పిల్లల్ని కన్న తల్లిదండ్రుల పేరు మీద ఆస్తి ఉన్నా పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కానీ తల్లిదండ్రులు బతికుండగా ఆ ఆస్తి పిల్లల పేరు మీద ఉంటేనే నరకం. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేయడం లేదు. కాబట్టి పిల్లల పేరు మీద ఆస్తులు కొనేముందు ఆలోచించుకుంటే మంచిది తల్లిదండ్రులు. మరి దీనిపై మీరేమంటారు.