ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి... దీంతో పలు ప్రాంతాల్లో పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ మద్య కాలంలో రోడ్డు పై ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారిని చూస్తూ వెళ్లిపోతున్నారు.. కొంతమంది అయితే సెల్ఫీలు తీసుకుంటూ లైకుల కోసం సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మానవత్వంతో స్పందించి కాపాడేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఇటీవల కుక్కల దాడుల్లో కొంతమంది చనిపోతున్నారు.. ఎంతోమంది తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో కుక్కలు అంటే చాలా మంది ద్వేషిస్తున్నారు. అలాంటిది ఓ కుక్క నాలాలో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలకు తెగించి మరీ నాలలోకి వెళ్లి ఆ కుక్కను భద్రంగా కాపాడి బయటికి తీసుకువచ్చారు. ఈ పిల్లల తెగువ చూసి నెటిజన్లు హ్యాట్సాప్ అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోయాయి. కొన్ని చోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా వరదనీటిలో చిక్కుకొని ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. సాధారణంగా కుక్కలను చూస్తే పిల్లలు పారిపోతుంటారు.. కొంతమంది వాటిపై రాళ్లతో దాడులు చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు పిల్లలు ప్రాణాలకు తెగించి మరీ నాలలో చిక్కుకున్న కుక్క కాపాడి ప్రాణాలు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సిటీ నాచారం ప్రాంతంలో ఓ పెద్ద నాలా ఉంది. దాదాపు పది అడుగుల లోతులో మురుగు నీరు ప్రవహిస్తుంది. ఎలా పడింతో ఓ కుక్క అందులో పడిపోయి.. నాలలోని రక్షణ గోడకు గ్యాప్ లో చిక్కుకొని బిక్కు బిక్కుమంటుంది. అది గమనించిన నాచారానికి చెందిన మల్లెపోగుల ప్రణీత్, తిరుపతి నాగరాజు అనే చిన్నారులు ఆ కుక్కను ఎలాగైనా రక్షించాలని అనుకున్నారు.
ఎంతో ధైర్యం చేసి నాలాలోకి చెప్పులు లేకుండా వెళ్ళారు.. మోకాలు లోతు నీటిలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. కుక్కను బయటకు తీశారు. దాన్ని ఎత్తుకొని మెల్లిగా పైకి తీసుకు వచ్చారు. నాలాలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కొట్టుకొనిపోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా ఓ మూగ జీవాన్ని రక్షించాలనే వారి ధృఢసంకల్పం ఎంతో గొప్పది కావడంతో కుక్కను సురక్షితంగా రక్షించారు. ‘అసాధారణమైన సాహసం.. కుక్కపై దయాగుణం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని.. ఎంతోమంది పిల్లలకు ప్రేరణ ఇస్తుందని’ స్ట్రే యనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అదులాపురం గౌతం పిసిఏ అధికారి అన్నారు. ఈ పిల్లల తెగువ, కుక్కపై ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాప్ అంటున్నారు. వాస్తవానికి ఈ వీడియో పాతదే అయినా.. ఇద్దరు చిన్నారులు ప్రాణాలకు తెగించి ఆ శునకాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి.. ఎక్కడైనా మూగజీవాలు ఆపదలో చిక్కుకుంటే వాటిని రక్షించి మానవత్వం చాటుకుందాం.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.