ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటే ఎంత లక్షణంగా ఉంటారు. భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఆడపిల్లలు బొట్టు పెట్టుకున్నట్టే.. చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. అయితే కొన్ని స్కూళ్ళు మాత్రం సాంప్రదాయాలను ఇంటి దగ్గర పెట్టుకుని రండి అంటూ కొత్త నిబంధనలు పెడుతున్నాయి. ఆ మధ్య అయ్యప్ప మాల ధారణలో పిల్లలు స్కూల్ కి వెళ్తే.. రానివ్వకుండా చేసింది ఓ స్కూల్ యాజమాన్యం. ఇప్పుడు మరో ట్రైనింగ్ స్కూల్ లో పని చేసే సిబ్బంది కూడా విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే జరిమానా విధించడం, వేధింపులకు గురి చేయడం చేస్తున్నారు. దీంతో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గా శిక్షణ ఇస్తున్నారు. ఈ విద్యార్థినులకు అక్కడే వసతి సౌకర్యం ఉంది. ఈ శిక్షణకు సంబంధించిన కోర్సుకు ప్రిన్సిపాల్ గా, వార్డెన్ గా విజయ సుశీల ఉన్నారు. అయితే విద్యార్థినులు బొట్టు పెట్టుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా.. తరచూ వేధించేవారట. జరిమానా విధించి.. వ్యక్తిగత పనులు చేయించుకునేవారట. మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరించేవారని విద్యార్థినులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ వేధింపులు ఎక్కువవడంతో ఇద్దరు యువతులు ఫ్యాన్ కు ఉరి వేసుకునేందుకు యత్నించారు.
బాధితులు విజయ సుశీలపై ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ లక్ష్మీ నర్సయ్యకు ఫిర్యాదు చేశారు. ఆమెను పిలిపించి వసతి గృహంలో ఉండకూడదని హెచ్చరించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె విద్యార్థినులను బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇద్దరు యువతుల్లో ఒక యువతి మంగళవారం మళ్ళీ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో శిక్షణ కేంద్రం అధికారులు విద్యార్థినులకు సెలవులిచ్చి ఇంటికి పంపేశారు. మరి బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే నేరం కింద చూస్తున్న ఆమెపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.