ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ యుద్ధం మరింత ముదురుతోంది. ఈనెల 3న ఛలో విజయవాడ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే ప్రధానంగా పట్టు బడుతున్నాయని.. అయితే ఆ డిమాండ్లకు కాలం చెల్లిందని తెలిపారు. అంతేకాక ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు క్రెడిట్ అయ్యాయని గుర్తు చేశారు. జీతాలు క్రెడిట్ చేయడం వల్ల రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదన్న ఆయన.. మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదని స్పష్టం చేశారు. ఒకరకంగా ఉద్యోగులు ఫిబ్రవరి 3న చేయబోయేది బలప్రదర్శనే అన్నారు. జఠిలమైన డిమాండ్లు పెట్టడం పరిష్కారం లేకుండా చేసుకోవడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే 3 డిమాండ్లపైనే పట్టుబడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల కార్యాచరణ ప్రారంభం కాకముందే చర్చల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చర్చల కోసం ప్రభుత్వం వైపు నుంచే ముందుగా చొరవ తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం కరెక్ట్ పద్ధతి కాదని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.అవసరం లేని చోట ఎవరిమీద బలప్రదర్శన చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ ఆంక్షలు అమలులో వున్నందున ఆందోళనకు అనుమతి ఇవ్వరని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్ధితిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సజ్జల హితవు పలికారు. ఒకరకంగా ఉద్యోగులు రేపు చేయబోయేది బలప్రదర్శనే అన్నారు.
కాగా.. పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వోద్యోగులకు పోలీస్ శాఖ షాకిచ్చింది. ఈ నెల 3న ఛలో విజయవాడకు అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతిరాణా తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వడం లేదని సీపీ పేర్కొన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమం చట్టవిరుద్ధమని క్రాంతి రాణా అన్నారు. ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా.. ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదని సీపీ వ్యాఖ్యానించారు.