ఉచితం, 50 శాతం తగ్గింపు, తక్కువ ధరకే.. అనే మాటలు వినబడితే చాలు.. జనాలు ఎంత దూరమైన వెళ్తారు. ఉచితం అని వినిపిస్తే.. చాలు ఊగిపోతారు. ఇక తాజాగా ఓ చోట రూపాయికే బిర్యానీ అనడంతో జనం ఎగబడ్డారు. మరి ఏం జరిగింది.. అంటే..
తెలుగు వారు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. మన దగ్గర విందు భోజనాల్లో వడ్డించే ఆహార పదార్థాలు చూస్తే.. ఎవ్వరైనా ఈ మాటే అంటారు. ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని రకాల రుచులను ఆస్వాదిస్తాం. రుచికరమైన భోజనం దొరుకుతుంది అంటే.. ఎంత దూరమైనా పోతాం. ఇక తెలుగువారనే కాదు.. సెలబ్రిటీల ఫెవరెట్ ఫుడ్ జాబితాలో.. ముందు వరుసలో నిలుస్తుంది బిర్యానీ. ఒకప్పుడు పట్టణాలకే పరిమితైమన బిర్యానీ.. నేడు చిన్న చిన్న టౌన్‌లు, కాకా హోటల్స్‌లో కూడా అదిరిపోయే రుచితో లభిస్తోంది. మన వాళ్లు ఉదయం టిఫిన్ బదులు బిర్యానీ తింటారంటే.. అది మన ఆహారంలో ఎంతలా భాగం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల పుణ్యమా అని.. ఇల్లు కదలకుండా.. ఒక్క క్లిక్‌తో మనకు నచ్చిన భోజనాన్ని ఇంటికే తెప్పించుకుని.. లాగిస్తున్నాం. ఇక ఆన్‌లైన్ ఆర్డర్‌లలో కూడా బిర్యానీదే అగ్రభాగం. అలాంటి బిర్యానీ.. ఒక్క రూపాయికే లభిస్తుంది అంటే జనాలు ఊరుకుంటారా.. ఊర్లు దాటి మరి పరిగెత్తుకు వస్తారు. తాజాగా ఓ చోట ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో కొత్తగా ఫుడ్ బిజినెస్‌లోకి వచ్చినవారు.. రెస్టారెంట్లు తెరిచిన వారు.. వ్యాపారం పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం.. రూపాయికే చికెన్ బిర్యానీ.. అంటూ అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. ఇంకేముంది జనాలు పోలోమంటూ అక్కడికి క్యూ కట్టారు. అందరూ బిర్యానీ కోసం ఎగబడటంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.
రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ ఆఫర్ పెట్టారు. అయితే ఈ ఆఫర్ కేవలం గురువారం ఒక్కరోజు మాత్రమే.. అది కూడా మధ్యాహ్నం 12-2 గంటల వరకు మాత్రమే అని బాగా ప్రచారం చేశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే.. పాత రూపాయి నోట్‌కు మాత్రమే బిర్యానీ అనడంతో.. ఇంకేముంది బీరువాలు, ట్రంకు పెట్టెలో దాచుకున్న పాత రూపాయి నోటును బయటకు తఘిస.. చేత పట్టుకుని.. రెస్టారెంట్‌కు పరిగెత్తారు జనాలు. ఏదో 20, 30 మంది వస్తారు అనుకుంటే వందలాది మంది.. పాత వంద నోటుతో రెస్టారెంట్‌కు క్యూ కట్టారు.
వందలాది మంది జనాలు భారీ ఎత్తన క్యూ కట్టడంతో.. మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రెస్టారెంట్ యజమాని అనుకున్నదానికన్నా ఎక్కువ మంది రూపాయి నోట్లతో బిర్యాని కోసం వచ్చారు. దాంతో గంటలోపే బిర్యాని అయిపోయిందని యజమాని రెస్టారెంట్ మూసేసి వెళ్లాడు. కొంతమందికే బిర్యానీ దొరకగా.. దక్కనివారు నిరాశగా వెనక్కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ సదరు యజమాని ప్లాన్ బెడిసికొట్టింది. ఏదో పదుల సంఖ్యలో జనాలు వస్తారనుకుంటే.. వందల మంది రావడంతో.. మధ్యలోనే చేతులు ఎత్తేయాల్సి వచ్చింది.
గతంలో కూడా కొన్ని రెస్టారెంట్‌లు ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని రోజుల క్రితం తిరుపతిలోని ఓ రెస్టారెంట్ ఐదు పైసలకే బిర్యానీ అని ఆఫర్ ప్రకటించింది. అలాగే కస్టమర్లకు మరో ఆఫర్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో వచ్చిన కస్టమర్లకు 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. అక్కడ జనాల తాకిడితో యజమాని అవాక్కయ్యాడు. అలానే విజయవాడలో కూడా ఓ హోటల్ ఐదు పైసల నాణెం తీసుకొస్తే భోజనం ఫ్రీ అన్నారు. అది కూడా మొదటి 50మందికే మాత్రమే అని ప్రకటించారు. అయినా జనాలు భారీగా క్యూ కట్టారు. కానీ 50 మందికే ఉచిత భోజనం అందించారు. దాంతో మిగతా వాళ్లు.. నిరాశతో వెనుదిరిగారు. మరి ఇలాంటి ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.