ఈరోజుల్లో నేను, నా కుటుంబం, నా ఇల్లు.. ఇంత వరకే చాలా మంది ఆలోచనలు పరిమితం అవుతున్నాయి. కానీ, ఆ ఊరి వాళ్లు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు లేని అమరావతి అనే అనాథ యువతికి ఊరంతా ఏకమై వివాహం చేసింది. అది కూడా తూతూమంత్రంగా కాదు.. ఎంతో ఘనంగా వియ్యంకుల వారు కూడా ముక్కున వేలేసుకునేలా అట్టహాసంగా పెళ్లి చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గుండుపాలలో నివసిస్తున్న ఆ యువతి పేరు అమరావతి. ఆమె జీవితంతో విధి వింత నాటకం ఆడింది. చిన్నప్పుడే తండ్రి లేకుండా చేసింది. ఎనిమిదేళ్ల వయసులో తల్లిని దూరం చేసింది. నా అనేవాళ్లు లేరు.. తనకంటూ ఏ తోడూ లేదు. కానీ, ఆ ఊరు మాత్రం మాకెందుకులే అనుకోలేదు. దాదాపు పదేళ్లుగా ఆమె బాగోగులు చూసుకున్నారు. ఏ చిన్న కష్టం రాకుండా ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఈ సమాజంలో ఆడపిల్ల ఒంటరిగా బతకడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ, ఆమెకు మాత్రం ఆ ఊరు ఏ కష్టం రానివ్వలేదు. ఊరంతా ఆమె కుటుంబమే. ఏదో మాటవరసకు అలా చెప్పడం కాదు. చేతల్లోనూ వారు అది నిరూపించారు.
విశాఖలోని ఓ ప్రైవేటు ట్రాన్స్ పోర్టులో డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్.. అమరావతిని చూడగానే ఇష్టపడ్డాడు. ఆమెను ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా వివాహం చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. అమరావతికి పెళ్లీడు వచ్చింది. ఎలాగైనా పెళ్లి చేయాలి. ఆమెను తమ ఊరి ఆడపడుచుగా భావించి వివాహం చేయాలని ఉపాధ్యాయుడు రాము తెలిపారు. అందుకు ఊరంతా ఒప్పుకొంది. పెళ్లి తూతూమంత్రంగా మాత్రం చేయకూడదని ఆ ఊరి వాళ్లు నిర్ణయించుకున్నారు. అమరావతి తల్లిదండ్రులు బతికుంటే ఎంత అట్టహాసంగా జరిగిదో.. అలాగే చేయాలని భావించారు.
అమరావతి నివసించే వీధిలోని చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఆమెకు బంగారు బుట్టలు చేయించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు టేకు మంచం, పరుపు, బీరువా తెచ్చారు. కొందరు చీరలు కొంటే.. కొందరు పెళ్లి ఖర్చులకు డబ్బిచ్చారు. ఆటో వాళ్లంతా పెళ్లి పనులు చూసుకున్నారు. మొత్తానికి ఏ లోటూ లేకుండా అంగరంగ వైభవంగా అమరావతి వివాహం జరిపించారు. ఆ ఊరి జనం చూపించిన ప్రేమానురాగాలకు అమరావతి భావోద్వేగానికి లోనైంది. తన తల్లిదండ్రులు బతికున్నా కూడా ఇంత ఘనంగా పెళ్లి చేయలేరేమో అని కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ ఊరి జనం చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.