ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా ఏదో ఒక్క దాంట్లో ఉద్యోగం రావడమే కష్టమవుతుంది. అలాంటిది వెళ్లిన ప్రతి దాంట్లోనూ జాబ్ ఆఫర్ వస్తే అంతకు మించిన అదృష్టం ఉంటుందా? ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. అప్లై చేసిన కంపెనీల్లో ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి.
ఈరోజుల్లో ఒక ఉద్యోగం సంపాదించడమే భగీరథ ప్రయత్నమైపోయింది. ఎంత పెద్ద చదువు చదివినా గానీ చదువుకు తగ్గా ఉద్యోగం దొరక్క చాలా మంది దొరికిన జాబ్ తో సరిపెట్టుకుంటున్నారు. రోజూ లక్షల రెజ్యూములు ఆఫీసులకు వెళ్తున్నాయి. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో రోజూ కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయి మాత్రం ఏకంగా ఐదు ఉద్యోగాలను సంపాదించింది. అది కూడా ఏకకాలంలో. కాలేజీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒకేసారి ఐదు కంపెనీలకు అప్లై చేయగా అన్ని కంపెనీలు జాబ్ ఆఫర్ చేశాయి.
విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన సాయి వర్షిణి. ఈ అరుదైన ఘనత సాధించింది. తండ్రి ఆనంద్.. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో సీబీఐ కోర్టులో పని చేస్తున్నారు. డాబా గార్డెన్స్ లో నివాసం ఉంటున్నారు. తల్లి పార్వతి, రైల్వేలో పని చేస్తున్నారు. వీరి మొదటి కూతురే ఈ సాయి వర్షిణి. పదోతరగతి వరకూ బేతనీ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్, ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ కాలేజీలో చేరిన సాయి వర్షిణి ఎంసీసీఎస్ (మ్యాథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్) సబ్జెక్టులు ఎంచుకుంది. ఫైనల్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళింది.
కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ తో ఐదు కంపెనీల ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ కంపెనీలన్నీ టాప్ కంపెనీలే కావడం విశేషం. వీటిలో ఇంటెల్ కంపెనీ అత్యధికంగా ఏడాదికి రూ. 7.25 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేయగా.. విప్రో రూ. 2.05 లక్షలు ఆఫర్ చేసింది. అయిదు కంపెనీల ఆఫర్ లో ఇంటెల్ ఆఫర్ నచ్చడంతో ఆమె ఆ కంపెనీలోనే చేరనుంది. ఈ విజయం వెనుక తనకు పాఠాలు చెప్పిన కాలేజీ లెక్చరర్స్, సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు కారణమని ఆమె వెల్లడించింది. తమ కూతురికి ఉద్యోగం వచ్చినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి ఏడు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని.. చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సివిల్స్ లో మంచి ర్యాంకు రావాలని తండ్రి ఆశిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదవమంటే వర్షిణి మాత్రం డిగ్రీ చదువుతానని పట్టుబట్టింది. దీంతో ఆమె కోరిక మేరకు తల్లిదండ్రులు డిగ్రీ కాలేజీలో చేర్పించారు. కట్ చేస్తే అద్భుతం చేసి చూపించింది. డిగ్రీ చదువు తక్కువ ని ఫీలయ్యే వారికి వర్షిణి సక్సెస్ స్టోరీనే నిదర్శనం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆమె నిరూపించింది. మరి ఒకేసారి 5 టాప్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు సంపాదించిన సాయి వర్షిణిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.