మానవ జన్మ లభించడమే ఓ వరం అయితే.. అందులోనూ ఎలాంటి వైకల్యం లేకుండా జన్మించడం మరింత అదృష్టం. ఈ సృష్టిలో అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ ఎంతో గొప్పది. మిగతా జీవరాశితో పోల్చితే.. మనిషికి మాత్రమే మంచి చెడు విచక్షణ తెలుసు. తన మెదడుతో ఆలోచించి.. అద్భుతాలు సృష్టించగల ప్రతిభ మానవుడి సొంతం. మరి ఇంత గొప్ప మానవ జన్మ లభించిన తర్వాత కూడా చాలా మంది.. తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు. ఎలాంటి వైకల్యం లేకుండా.. కాళ్లు చేతులు పని చేస్తున్నప్పటికి.. కష్టపడి పని చేయాలంటే బద్దకం కొందరికి. మరి కొందరేమో.. చిన్న చిన్న సమస్యలకే జీవితాలను అంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు నికోలస్ వుజిసిక్. ఆయన గురించి.. ఆయన జీవితంలో ఉన్న పెను విషాదం గురించి తెలిస్తే.. అసలు జీవితం అంటే ఇది కదా అనిపిస్తుంది. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోన్న నికోలస్ వుజిసిక్ గురించిన వివరాలు..
నిక్ వుజిసిక్ 1982, డిసెంబర్ 4న ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లో జన్మించాడు. దుసంక, బోరిస్లావ్ వుజిసిక్ ఆయన తల్లిదండ్రులు. అయితే నిక్ వుజిసిక్ అందరిలాగా సహజంగా జన్మించలేదు. టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధి కారణంగా పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకుండా జన్మించాడు. కాళ్లు మాత్రం కాస్త ఉంటాయి. వాటిని చికెన్ డ్రమ్‌స్టిక్స్‌తో పోల్చుతాడు నిక్. భూమ్మీద పడ్డ నిక్ రూపం చూసి అతడి తల్లి.. తనిని ఎత్తుకోవడానికి.. దగ్గరకు తీసుకోవడానికి కూడా భయపడింది అంట. తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డ తమకు వద్దని ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారట. కానీ పేగు బంధం వారిని మళ్లీ ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చింది. ఈ విషయాలను నిక్ తన ఆటోబయోగ్రఫిలో వెల్లడించాడు.
తల్లిదండ్రులు తనను ఎంత ప్రేమగా చూసుకున్నా సమాజం మాత్రం తనను అనేక రకాలుగా అవమానించింది అని తెలిపాడు నిక్. వీటిని భరించలేక.. ఒకానొక సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించాడు. ఇక నిక్ పదిహేడో ఏట ఉండగా పేపర్‌లో చూసిన ఓ సంఘటన అతడి జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు నిరాశలో కొట్టుమిట్టాడుతున్న నిక్ జీవితానికి ఆ పేపర్ కటింగ్ మార్గం చూపింది. నిక్ తల్లి ఆ పేపర్‌ని తీసుకొచ్చి అతడికి చూపిందింది. దానిలో ఓ చోట తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న మహిళ ఒకరు.. ప్రార్థనలు చేస్తున్నట్లుగా పేపర్‌లో వచ్చింది. దాన్ని చూసి ప్రేరణ పొందిన నిక్.. తాను కూడా ప్రేయర్ గ్రూప్స్‌లో మాట్లాడటం ప్రారంభించాడు. అలా నేడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గొప్ప మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిక్ తన 21వ ఏట గ్రిఫిత్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. ఆ తర్వాత నిక్ బటర్‌ఫ్లై సర్కస్ అనే షార్ట్ ఫిలింలో నటించాడు. ఈ క్రమంలో 2010లో మెతడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్ ఇన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు. 2008లో నిక్‌కి కానే మియహర అనే ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 2012, ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం నిక్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు.
నిక్ తొలి పుస్తకం లైఫ్ విత్ అవుట్ లిమిట్స్ అనే పుస్తకం 2010లో విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 32 భాషల్లోకి అనువాదం అయ్యింది. ఆ తర్వాత పలు రచనలు చేశాడు నిక్. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం నిక్ జీవితాన్ని స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితాల్లో భాగంగా ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో పదో తరగతి ఇంగ్లీష్‌లో నిక్ జీవితాన్ని ప్రత్యేక పాఠంగా చేర్చానున్నారు. తాజాగా నిక్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. మరి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నిక్ జీవితాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. pic.twitter.com/HNioLb1hn5
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 1, 2023