జనసేన కుటుంబ పార్టీ కాదని, కుల పార్టీ అంతకన్నా కాదని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలకు జనసేన సమ ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ లీడర్‌షిప్‌తోపాటు జనసేన కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌లా నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరిదీ జనసేన అని నాగబాబు చెప్పారు. తాను జనసేన అభివృద్ధికి, నిర్మాణానికి ఓ మెట్టులా పాటుపడతానే తప్ప భవిష్యత్తులో పార్టీ పవర్‌లోకి వస్తే అందులో భాగం కానన్నారు.
రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు పక్కాగా ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు అన్నారు. ‘పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఇది తథ్యం. జనసేనలో ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంది. పార్టీలో ఎవరైనా సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన మాత్రమే. కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా జనసేనలో ఉంటుంది’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి.. వారిని పరిపాలనలో భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. మరి, రాబోయే రోజుల్లో పవన్ సీఎం అవడం తథ్యం అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.