ర్యాష్ డ్రైవింగ్ వల్ల నిత్యం ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. కొందరు ప్రబుద్ధులు పట్టించుకోవడం లేదు. పైగా రాజకీయ నాయకుల అండ చూసుకుని మరింత రెచ్చిపోతున్నారు. పోలీసులపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్ హల్ చల్ చేశారు. బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ లో వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను కృష్ణలంక ఎస్ఐ ఆపారు. ఈ క్రమంలో వారు తాము ఎంపీ నందిగామ సురేష్ అనుచరులం అంటూ పోలీసులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీ పీఎస్‌కు వెళ్లి, తన అనుచరులతో కలిసి ఎస్ఐతో, సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
పీఎస్‌లో ఎంపీ నందిగాం సురేష్, అతడి అనుచరులు చేస్తున్న తతంగాన్ని వీడియో తీస్తున్నాడన్న కారణంగా కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడి చేశారు. కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కోవడంతో పాటు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు సురేష్ అనుచరులు ధ్వంసం చేశారు. స్టేషన్లో గొడవ పడిన తరువాత అనుచరులతో కలిసి ఎంపీ నందిగాం సురేష్ వెళ్లిపోతుండగా, గేటు దగ్గరికి వెళ్లి తన ఫోన్ తిరిగివ్వాలని కానిస్టేబుల్ వారిని అడిగారు. ఫోన్ అడిగినందుకు కానిస్టేబుల్‌పై ఎంపీ అనుచరులు దాడిచేసి కొట్టారని సమాచారం.
అసలేం జరిగిందంటే..
ఎంపీ నందిగాం సురేష్ మేనల్లుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి విజయవాడలోని ఓ మల్టిప్లెక్స్ లో సినిమాకు వెళ్లాడు. షో పూర్తయ్యాక బైకుపై అతివేగంగా వెళ్తున్నారు. ఇది గమనించిన కృష్ణలంక పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ వద్ద ఆపారు. తాము ఎంపీ మనుషులం అంటూ యువకులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అడిగిన వాటికి బదులివ్వకుండా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. యువకులను బలవంతంగా ఎస్ఐ, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు తరలించగా, దీన్ని వీడియో తీసిన యువకులు నందిగాం సురేష్‌కు పంపించారు. ఆయన తన అనుచరులతో వచ్చి.. స్టేషన్లో వీరంగం ఆడారు. దాడికి సైతం పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.