ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సలహాలు తమకు అవసరంలేదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్‌లో సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ డిజిటల్ ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రాణత్యాగాలు చేసైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని, వారు అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, కనీసం ప్లకార్డులు పట్టుకుంటే చాలని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. విశాఖపట్నం ప్రైవేటీకరణ విషయాన్ని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని.. వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. ప్లకార్డులు పట్టుకుంటే ప్రైవేటీకరణను ఆపేసేపనైతే.. తమ ఎంపీలు వీపుల వెనక ఆ విధంగా రాపించుకుంటారని చెప్పారు.
వైసీపీకి పవన్ కళ్యాణ్ సలహాలు ఇవ్వడం ఏంటని ఆక్షేపించారు. ఇక వైసీపీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అని.. పవన్ కళ్యాణ్ కాదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మా పార్టీకి వ్యూహకర్త పీకే.. అంటే ప్రశాంత్ కిశోర్! ఈయన ఈ పీకే అనుకుంటున్నట్లు ఉన్నారు. బాబూ పవన్ కళ్యాణ్ నీకొక నమస్కారం.. నువ్వు ఇచ్చే సలహాలు మా సీఎం వింటే.. మేమెవ్వరం మళ్లీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు. పవన్ కల్యాణ్ ఆ సలహాలేవో దత్తత తండ్రి చంద్రబాబుకో, లేక బీజేపీకో ఇచ్చుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తాము చేసేది చేస్తామని, అసలు పవన్ కల్యాణ్ ఏంచేస్తాడో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు.