దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. దీంతో పాఠశాలల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన మరువక ముందు ఏడో తరగతి చదువుతున్న ఓ బాలికపై స్కూల్ లైబ్రరీ అసిస్టెంట్ లైంగిక వేధింపులకు పాల్పపడటం కృష్ణాజిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా మచిలీపట్నం కి చెందిన పల్లపాటి శ్రీకృష్ణ గత కొంత కాలంగా భట్ట జ్ఞానకోటయ్య ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ అసిస్టేంట్ గా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలకు చెందిన ఏడోతరగతి అమ్మాయి లైబ్రెరీలో జరిగే తరగతికి హాజరవుతూ ఉండేది. ఆ సమయంలో శ్రీకృష్ణ కన్ను ఆ బాలికపై పడింది. ఈ క్రమంలోనే ఆ బాలిను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. రెండు రోజులుగా బాలిక ఒంటరిగా కూర్చొని ఏడవడం గమనించిన తల్లి ఆరా తీయడంతో తనని లైబ్రరీ అసిస్టేంట్ శ్రీకృష్ణ దారుణంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. దాంతో బాలిక తల్లి పాఠశాలకు వెళ్లి హెచ్ ఎం కి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన శ్రీకృష్ణ పిలిపించి విచారిస్తున్న సమయంలోనే బాలిక తల్లిదండ్రులు, బంధువులు అతడిపై దాడి చేసి దేహశుద్ది చేశారు.
ఈ విషయం గురించి సమాచారం అందుకున్న ఎస్ఐ రవీంద్ర స్కూల్ కి వెళ్లి శ్రీకృష్ణను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన మంత్రి జోగి రమేష్ బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. విద్యాలయాల్లో ఇటీవల జరుగుతున్న దారుణాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయని.. నింధితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.