అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో బిడ్డ ఆ మహిళా అధికారి దగ్గర ఉన్నాడు. అయినా సరే బిడ్డను కడుపున కట్టుకుని మరీ అక్రమాన్ని ఆపేందుకు శివంగిలా బయలుదేరారు.
పిల్లల తల్లులు డ్యూటీ విషయంలో అస్సలు రాజీ పడడం లేదు. తీసుకునే జీతానికి న్యాయం చేయడం కోసం చాలా నిజాయితీగా పని చేస్తున్నారు. ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. మెటర్నిటీ లీవ్ తీసుకుని ప్రసవం జరిగిన వారం, రెండు వారాలకే మళ్ళీ విధుల్లో చేరిన మహిళా ఐఏఎస్ అధికారులు ఉన్నారు. చంటి బిడ్డతో విధులను నిర్వర్తిస్తున్న తల్లులు ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ కథ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈమె కదనరంగంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా అక్రమార్కులను వెంబడించి మరీ వారి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు.
10 నెలల బాబుతో స్కూటీపై ఛేజ్ చేసి మరీ అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తూరులో చోటు చేసుకుంది. పసుమర్రు గ్రామ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా మట్టిని తవ్వి లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా వీఆర్వో మీనా.. ఆలస్యం చేయకుండా తన బిడ్డను కడుపుకి కట్టుకుని శివంగిలా స్కూటీపై బయలుదేరారు. అక్రమార్కులు లారీలపై వెళ్తుంటే వెంబడించి మరీ అడ్డుకున్నారు. లారీలను సీజ్ చేసి జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె నిజాయితీకి, నిబద్ధతకు, ధైర్యానికి నెటిజన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చంటి బిడ్డను పెట్టుకుని డ్యూటీ చేయడమే కష్టం.. అలాంటిది చంటి బిడ్డతో మట్టి లారీలను వెంటాడి మరీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. లారీ ముందు ఆమె స్కూటీ ఆపిన విధానం చూస్తే ఆమె ధైర్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అది ఆమె నీతి, నిజాయితీల నుంచి వచ్చింది. నీతి, నిజాయితీ ఉన్న వారే ఇలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటారు. అప్పట్లో కదనరంగంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా అయితే వీపుకి బిడ్డను కట్టుకుని యుద్ధం చేశారో అలా ఈమె కడుపున బిడ్డను కట్టుకుని అక్రమార్కులను వెంబడించి మరీ అడ్డుకున్నారు. సాధారణంగా ఇసుక, మట్టి మైనింగ్ మాఫియాకి అడ్డుపడితే చంపేస్తామని బెదిరిస్తుంటారు. అలాంటి బెదిరింపులు వస్తాయన్న భయం కూడా లేకుండా ఆమె అంత ధైర్యంగా అడ్డుపడ్డారంటే ఆమె గట్స్ కి సెల్యూట్ చేయాల్సిందే. మరి అక్రమ మట్టి మాఫియాను ధైర్యంగా ఎదుర్కున్న మహిళా వీఆర్వోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.