ఒక దేశంగానీ, రాష్ట్రం గానీ, గ్రామం గానీ అభివృద్ధి చెందాలంటే అక్కడి రోడ్డు వ్యవస్థ పటిష్టంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ‘కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీలో రోడ్ల పరిస్థితి అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా ఉందని ఆరోపించారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన తరఫున సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపైన్‌కు పిలుపునిచ్చారు. ఇవి సరదాగా చేస్తున్న రాజకీయ విమర్శలు కాదని.. నివర్ తుపాను సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డు చిధ్రమైందని.. ఆ గుంతల్లో పడి ఓ ట్రాక్టర్ బోల్తాపడిందని గుర్తు చేసుకున్నారు. ట్రాక్టరే కాదు.. గర్భిణీ స్తీ వెళ్లే ఆటో కూడా బోల్తాపడిందని. ఆ ఒక్క గ్రామమే కాకుండా నియోజకవర్గమంతా అదే పరిస్థితి అని తన దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. రోడ్ల గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం, లాఠీఛార్జీలు చేసే పరిస్థితి ఉందని పవన్ కల్యాణ్ విమర్శించారు. రోడ్లు బాగోలేదు మీరేమైనా చేయండని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగిన గిద్దలూరు నియోజకవర్గంలోని వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధింపులకు గురి చేశారని విమర్శించారు.
కరోనా వల్ల ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయేమో ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇంతకాలం ఎదురుచూసినట్లు తెలిపారు. రానురాను పరిస్థితి దిగజారిపోతునట్లు వ్యాఖ్యానించారు. సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో ప్రతి జనసైనికుడు, వీరమహిళ, ఊరు బాగుకోరే ప్రతిఒక్కరు వారి ప్రాంతాల్లోని పాడైన రోడ్ల ఫొటోలు తీసి #JSPFORAP_ROADS అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిపై స్పందించి ప్రభుత్వం రోడ్లను బాగు చేస్తే సరే.. లేదా గాంధీ జయంతి రోజు మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందాం. రోడ్లను బాగుచేసే శ్రమదానం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని పవన్ కల్యాణ్ తెలిపారు.
Save AP Roads campaign from September 02nd – JanaSena Chief Sri @PawanKalyan #JSPForAP_Roads
Full Video : https://t.co/OYWEC4kFUf pic.twitter.com/xnjThoONyH
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2021