ప్రపంచంలో ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు.. మంచి లాభాలు సంపాదించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్న విషయం తెలిసిందే. కానీ ఆయన మాత్రం అక్కడ ఎలాంటి లాభం లేకుండా తన స్వార్థం చూసుకోకుండా పదిమందికి కడుపు నిండేలా చూస్తున్నారు. లాభాపేక్ష లేకుండా.. తోటి వారికీ సహాయ పడాలనే కాంక్షతో జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారు చాలా అరుదుగా తారసపడుతుంటారు.
తమిళనాడులోని వడివేలంపాల్యం కె.కమలతాల్ అనే 80 ఏళ్ల బామ్మా గత 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. సాధారణంగా మనకు టిఫిన్ రూ.20 నుంచి 30 వరకు అమ్ముతుంటారు. కానీ ఆ భామ్మ మాత్రం కేవలం ఒక్కరూపాయినే ఇడ్లీ అమ్ముతుంది. దీనికి ముందు 50 పైసలు మాత్రమే తీసుకునేది. కానీ ఇప్పుడు 50 పైసలు చలామణిలో లేదు కాబట్టి రూపాయికి పెంచాల్సిన అవసరం వచ్చింది. ఆ బామ్మ సేవాగుణం గురించి అక్కడ చుట్టు పక్కల వాళ్లకు మాత్రమే కాదు యావత్ భారతదేశానికి తెలియడంతో ఎంతగానో మెచ్చుకున్నారు.
తాజాగా అలాంటి గొప్ప మనసు చాటుకుంటున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి–కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరు కి చెందిన రామకృష్ణ అలియాస్ రాంబాబు.. ఆయన సతీమణి రాణి హూటల్ నిర్వహిస్తున్నారు. ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హూటల్ నిర్వహిస్తున్నారు. గతంలో ఆ ఊరిలో అన్ని హూటళ్లలో ఒక్కరూపాయికే ఇడ్లీ అమ్మేవారు.. కానీ ఎప్పుడైతే ధరలు పెరిగిపోయాయో వాటి ధరలు కూడా పెంచేశారు. కానీ రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. ఇక రాంబాబు రుచితో పాటు మంచి పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తున్నారు. దాంతో స్థానికులే కాదు.. దూర ప్రాంతాల నుంచి కూడా అక్కడ క్యూలో నిలుచొని మారీ టిఫిన్ చేసి వెళ్తుంటారు.
ఒక్క రూపాయితో ఏం లాభం వస్తుందన్న ప్రశ్నకు.. తక్కువ ధర అయినా తన వద్దకు ఎక్కువ మంది వస్తుంటారు.. పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్‌ను నడిపిస్తున్నామని అన్నారు రాంబాబు. దాదాపు రోజుకు 500 మంది తన హోటల్‌కు వస్తారని చెబుతున్నారు. గతంలో చాలా మంది వ్యాపారులు తనని ఎక్కువ రేటు పెంచాల్సిందిగా ఇబ్బంది పెట్టారని.. కానీ తనకు మాత్రం ఇష్టం లేదని అన్నారు. ఈ వ్యాపారం 16 ఏళ్ళుగా చేస్తున్నానని.. అప్పట్లో అర్థరూపాయికి అమ్మేవాడినని.. ఇప్పుడు రూపాయి చేసినట్లు చెప్పారు రాంబాబు. రూ.20 చెల్లించడం కష్టమని, వారికోసమే ఇలా తక్కువ ధరకు ఇడ్లీ అమ్ముతున్నట్లు చెప్పారు. చేసే పనిలో ఎలాంటి లాభాలు ఆశించకుండా పది మందికి తక్కువ ధరకే ఇడ్లీలు అమ్ముతున్న రాంబాబు కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలమా…