అమ్మాయిలు అబ్బాయులుగా మారడం, అబ్బాయిలు అమ్మాయులుగా మారడం. ఈ మాట వినగానే అందరికీ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ సినిమా గుర్తుకి రావడం ఖాయం. కానీ.., మీకు తెలుసా? ఇదేమి సినిమాలో చూపించినట్టు కొత్త విషయం కాదు. మన పాత రోజుల్లో దీనిని ఒక ఆచారంగా భావించేవారు. కొన్ని వంశాల వారు పెళ్లిళ్ల సమయంలో పెళ్లి కొడుకుని అమ్మాయిగా ముస్తాబు చేసి వీధిలో ఉరేగించేవారు. ఆ తరువాత ప్రత్యేక పూజలు చేయించి అప్పుడు మాత్రమే వధువు మెడలో తాళిని కట్టనించే వారు. అయితే.., ఇక్కడ మాత్రం ఏకంగా అమ్మాయి కూడా అబ్బాయిగా మారిపాయింది. పెళ్లి కొడుకు చీర కట్టుకుని సింగారాన్ని ఒలకబొస్తుంటే, పెళ్లి కూతురు పంచ కట్టుకుని మగరాయుడిలా ఫోజులు ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఇందుకు వేదిక కావడం విశేషం.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బి. చెర్లోపల్లి గ్రామంలో గుమ్మా ఆవులయ్య కుమారుడు అంకయ్య, అరుణ అనే యువతి వివాహం ఈ మధ్యనే జరిగింది. పెళ్లి తర్వాత పోలెరమ్మ, అంకాలమ్మదేవతలకు పూజలు నిర్వహించడం వీరి వంశంలో అలవాటు. కాకుంటే.., ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ పూజలు చేయడానికి వరుడు వధువులా.., వధువు వరుడిలా మారాల్సి ఉంటుంది. పెద్దల సూచన మేరకు వరుడిలా మారిన వధువు, వధువులా మారిన వరుడు బయటకి వచ్చి కెమెరాలకి ఫోజులు ఇచ్చారు. తప్పెట్లు, తాళాలతో గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు, నాగుల పట్టకు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసారు. ఇవి పూర్వకాలం నుండి తమ వంశంలో వస్తున్న ఆచారం అని అంకయ్య పేర్కొన్నారు. నిజానికి ఇలా గ్రామ దేవతలకి పూజలు చేస్తే.., కొత్త దంపతులకి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయని ఆ వంశస్థుల నమ్మకం. ఏదేమైనా ప్రస్తుతం ఈ జంబలకిడి పంబ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.