తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోవిందరాజు ఆలయ సమీపంలో ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు బైకులు దగ్ధమయ్యాయి.
తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మాఢవీధిలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి దగ్గరలో గోవిందరాజు స్వామి ఆలయ రథం ఉండడంతో ఎక్కడ రథానికి మంటలు అంటుకుంటాయో అని భయపడ్డారు. ఇంతలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. గాలి వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతుంది. ఈ ఘటనలో పలు బైకులు దగ్ధమయ్యాయి.
కాగా ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా మాఢవీధుల్లో రాకపోకలు నిలిపివేశారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు. లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణం తగలబడడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికైతే ఇంకా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.