సంక్రాంతి.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి సెటిల్ అయిన వారంతా ఈ ఒక్క పండగ కి మాత్రం తమ సొంత ఊరికి చేరుకుంటూ ఉంటారు. చుట్టాలు, స్నేహితులు మధ్య పండగ మూడు రోజులు ఆనందంగా గడపాలని తపిస్తూ ఉంటారు. ఇందుకే ఎంత కష్టం అయినా.. సంక్రాంతికి అందరూ కచ్చితంగా ప్రయాణాలు పెట్టుకుంటారు. అయితే.. ఇదే అదునుగా భావించే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఈ గ్యాప్ లో దందాకి తెర లేపుతుంటాయి. అమాంతంగా టికెట్ రేట్లు పెంచేసి.. సామాన్యుడిని దోపిడీ చేసేస్తూ ఉంటాయి. ఈ తంతు చాలా ఏళ్లుగా జరుగుతూనే వస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.., తొలిసారి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టింది. ఈ సంక్రాంతి పండగకి టికెట్ రేట్లు పెంచేసి.. అధికంగా ఛార్జ్ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై ఉక్కుపాదం మోపడం మొదలు పెట్టింది.
ఈ పండుగను ఆసరాగా చేసుకుని గుంటూరు జిల్లాలో ప్రైవేటు బస్సుల యాజమాన్యం అధిక ధరలను వసూలు చేస్తోంది. ఈ విషయం తెలిసిన రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలనకు విరుద్ధంగా నడుపుతున్న 13 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేశారు. పండుగ సమయంలో ప్రైవేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ సంయుక్త కమీషనర్ వెంకటేశ్వరరావు ప్రకటించిన మరుసటి రోజే ఈ తనిఖీలు జరిగాయి. అధిక చార్జీలు వసూలు చేస్తున్న 13 ప్రైవేటు బస్సులను గుర్తించి, వాటి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఇక ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే కాదు, ప్రజల నుండి కూడా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా వెంటనే యాక్షన్ తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ వారు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోనే సంక్రాంతి సంబరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రాష్ట్ర ప్రజలు దోపిడీకి గురి కాకూదని సీఎం జగన్ ఈ విషయంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మరి.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.