మెడికో ప్రీతి విషాదకర మరణంపై జనసేన పవన్ కల్యాణ్ స్పందించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం సరైన టైంకి స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.
మెడికో ప్రీతి ఆత్మహత్య ఉదంతం.. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఆమెని సైఫ్ అనే సీనియర్ వేధించాడు. దీంతో మరో మార్గం లేక ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఆమెని ఆస్పత్రిలో చేర్చగా.. ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది. ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు మధ్య ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం మొండ్రాయి గిర్నీతండాకు పోలీసులు తరలించారు. ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. ప్రీతి మరణంపై సామాన్యుల నుంచి మంత్రులు, రాజకీయ నేతల వరకు ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకారణమని చెప్పిన పవన్ కల్యాణ్ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పవన్ స్పందనని నోట్ గా రిలీజ్ చేశారు. దీన్ని జనసేన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవర్మణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ, బాధ్యులపై సరైన రీతిలో స్పందించి ఉంటే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు’
‘డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. సీనియర్ విద్యార్థులు ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలో అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలని’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ప్రీతి మృతి పట్ల ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మరి ప్రీతి విషయంలో జరిగిన దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MVkSMsjn34
— JanaSena Party (@JanaSenaParty) February 27, 2023