మత్తు పదార్థాలు, వ్యసనాలకు బానిసలై.. జీవితాలు తల కిందులవుతున్నా యువత పెడదారి పడుతూనే ఉన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మత్తు పదార్థాల విక్రయం జోరుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యాపారం ముసుగులో మత్తు ఇంజెక్షన్లను అమ్ముతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో వెలుగు చూసింది.
మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. తుక్కు వ్యాపారం మాటన ఈ విక్రయాలు జరుగుతున్నాయి. దువ్వాడ సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్లిపురానికి చెందిన ఎన్.మహేశ్వర్ రెడ్డి ఆటోనగర్ సమీపంలోని యాదవ జగ్గరాజు పేట, అపెరల్ పార్క్ రోడ్డు మధ్యలో తుక్కు దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారం ముసుగులో మత్తు ఇంజెక్షన్లు, గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నస్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు అతడి దుకాణాన్ని పరిశీలించగా.. విస్తు పోవడం వారి వంతైంది. నిందితుడి నుండి 35 మత్తు ఇంజెక్షన్లు, గంజాయితో నింపిన సిగరెట్లు, విడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతా నుండి ఇక్కడకు వస్తున్న మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతామని, ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి తీసుకెళతామన్నారు.