గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చి ఇచ్చినందుకు డెలివరీ ఏజెంట్ కు అదనంగా డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంది. కొంతమంది ఇష్టంతో ఇచ్చినా, కొంతమంది అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇక డెలీవరీ ఏజెంట్లకు గ్యాస్ ఏజెన్సీలు నెల నెలా జీతాలు ఇస్తున్నప్పుడు.. అదనపు ఛార్జీలు ఎందుకు ఇవ్వాలి అనే వాదన కూడా లేకపోలేదు. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై గతంలో హెచ్పీసీఎల్ కంపెనీ స్పందించింది. డెలివరీ బాయ్ కి అదనంగా డబ్బులు ఇవ్వొద్దు అంటూ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొంతమంది డెలివరీ బాయ్ ల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు భావించిన ఏపీ పౌరసరఫరాల శాఖ ప్రజలకు అదనపు ఛార్జీల విషయంలో స్పష్టత ఇచ్చింది.
ఎల్పీజీ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు అదనపు ఛార్జీలు ఇవ్వద్దని ఏపీ ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ వెల్లడించారు. సిలిండర్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన పని లేదని.. రసీదుపై ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే చాలని ఏపీ ప్రజలకు సూచించింది. నిర్ణీత పరిధిలో ఉన్నా సరే.. కొంతమంది డీలర్లు, డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు తమ వద్దకు వచ్చాయని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే.. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని కోరారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ 1967 ఏర్పాటు చేశామని.. ఎప్పుడైనా ఎవరైనా నిబంధనలను అతిక్రమించి అదనపు ఛార్జీలు అడిగితే ఈ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అలానే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన టోల్ ఫ్రీ నంబర్ 1800 2 333 555 నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కస్టమర్ ఇంటి దూరం డీలర్ వద్ద నుంచి 5 కిలోమీటర్ల లోపు ఉంటే డబ్బులు చెల్లించాల్సిన పని లేదని అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఒకవేళ డీలర్ నుంచి కస్టమర్ ఇంటికి.. 5 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటే గనుక సిలిండర్ కు రూ. 20 చెల్లించాలని.. 15 కిమీ పైన దూరానికి సిలిండర్ కు రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరి మీ ఇల్లు డీలర్ కి ఎంత దూరంలో ఉంది? 5 కి.మీ. లోపు అయితే డబ్బులు చెల్లించవలసిన పని లేదు. డెలివరీ ఏజెంట్ గానీ, గ్యాస్ ఏజెంట్ గానీ డెలివరీ ఛార్జీలు అడిగితే 1967, 1800 2 333 555 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మరి ఏపీ పౌరసరఫరాల శాఖ స్టార్ట్ చేసిన కాల్ సెంటర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
గ్యాస్ సిలిండర్ పై అదనపు డెలివరీ చార్జీలు చెల్లించొద్దు
పౌరసరఫరాల శాఖ ప్రకటన pic.twitter.com/0PK3QAqqZ8
— Rahul (@2024YCP) January 31, 2023