ప్రస్తుతం పొయ్యి పెట్టి.. దాని ముందు కూర్చుని.. పొగతో ఇబ్బంది పడుతూ.. వంట చేసే కాలం పోయింది. నేడు దాదాపు 90 శాతం జనాభా గ్యాస్ సిలిండరే వాడుతున్నారు. గ్యాస్ మీద ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ వంటి వాటి గురించి పక్కన పెడితే.. గ్యాస్ బుక్ చేయగానే.. డెలివరీ బాయ్.. ఇంటికి వచ్చి గ్యాస్ ఇచ్చిపోతాడు. ఊరికే పోడు.. గ్యాస్ తెచ్చినందుకు అదనంగా 20, 30 రూపాయలు అడుగుతాడు. పోనిలే ఇంటికే తెచ్చాడు కదా.. అనే ఉద్దేశంతోనే.. టిప్‌లా భావించో.. చాలా మంది అడగ్గానే ఆ డబ్బులు ఇస్తారు. కొందరు మాత్రం.. గ్యాస్ డెలివరీ చేయాల్సిన బాధ్యత మీదే.. ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని వాదిస్తారు. అయితే ఎవరెన్ని వాదనలు చేసినా డెలవరీబాయ్ మాత్రం తాను తీసుకోవాల్సిన డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఇది గ్యాస్ కనెక్షన్ ఉన్న అందరి ఇళ్లల్లో కామన్‌గా జరిగే తంతే.
అయితే ఇకపై ఇలా డెలివరీబాయ్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని హెచ్‌పీసీఎల్ కంపెనీ స్పష్టం చేసింది. డెలివరీబాయ్‍కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు హెచ్‌పీసీఎల్ కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ సీకే నరసింహ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ డెలివరీబాయ్‌కు డెలవరీ ఛార్జ్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని.. అందుకయ్యే ఛార్జీలు.. అనగా డెలివరీ ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన రాబిన్ అనే వ్యక్తి.. డెలివరీబాయ్‌లు అదనంగా తీసుకుంటున్న డబ్బుల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా.. హెచ్‌పీసీఎల్ కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ సీకే నరసింహ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఎవరైనా అదనంగా డబ్బు అడిగితే గ్యాస్ ఏజెన్సీలకు కంప్లైట్ చేయెుచ్చునని తెలిపారు. కంప్లైట్ ఆధారంగా డెలవరీబాయ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం.. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి సిలిండర్ బుక్ చేశాడు. దాన్ని తీసుకొచ్చిన డెలవరీబాయ్ అదనంగా రూ.30 ఇవ్వాలని అడిగాడు. అందుకు సదరు వినియోగదారుడు నిరాకరించగా.. డెలవరీబాయ్ సిలిండర్ రిటర్న్ తీసుకొని వెళ్లిపోయాడు. దీని గురించి సదరు వినియోగదారుడు డిస్ట్రిబ్యూటర్‌ను అడగ్గా.. వారు కూడా డెలవరీబాయ్‌ను సమర్ధించారు. వాళ్లకి కూడా సరఫరా ఖర్చులు ఉంటాయని.. వాటనే అడుగుతారంటూ డెలివరీ బాయ్‌ను వెనకేసుకొచ్చారు. దీనిపై సదరు వినియోగదారుడు న్యాయపోరాటం చేశాడు.
తనకు జరిగిన అన్యాయంతోపాటు ఏజెన్సీ చేసిన నిర్వాకాన్ని వినియోగదారుల ఫోరానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇందుకు గాను తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. వినియోగదారుడి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన వినియోగదారరుల ఫోరం… గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు ఇచ్చింది. ఇలా ఇరు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం ఏజెన్సీకి లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ డబ్బును బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది. ఇది కచ్ఛితంగా సేవా లోపమని అందుకే లక్ష జరిమానా విధిస్తున్నట్లు వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.