జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఏపీ మంత్రి రోజా సన్నీ లియోన్ తో పోల్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సన్నీ లియోన్ మంత్రి రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏపీలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ యుద్ధ వాతావరణానికి తెరలేపుతున్నారు. ఇటీవల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా ఏళూరులో జరిగిన సభలో వాలంటీర్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ బాంబ్ పేల్చాడు. దీంతో ఒక్కసారిగా వాలంటీర్లు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపైకెక్కి నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రోజా కూడా పవన్ పై కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే.., ఇప్పుడు రోజా కామెంట్స్ పై ఒకప్పటి శృంగార తార సన్నీలియోన్ స్పందించింది అన్న పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో నిజం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పవన్ పై విమర్శలు గుప్పిస్తూ.. ఆయన్ని సన్నీలియోన్ తో పోల్చింది. రోజా మాట్లాడుతూ.. “పవన్ ఒంటెద్దుపోకడలతో ఎవరి మాట వినకుండా ప్రవర్తిస్తారు. అందుకే తన భార్యలను కూడా వదిలేశారు. కరోనా సమయంలో మీరు ఇంట్లో దాక్కుంటే ప్రాణాలకు తెగించి ప్రజలకు సాయం చేసింది ఈ వాలంటీర్లే. సంస్కారం లేని పవన్ సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. పవన్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుగా ఉంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు రోజా.
కాగా.. మంత్రి రోజా వ్యాఖ్యలపై జనసేన అభిమానులు గట్టిగానే కౌంటర్స్ ఇచ్చారు. కానీ.., రోజా వ్యాఖ్యలపై సన్నీలియోన్ స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సన్నీలియోన్ పేరుతో ఉన్న ట్వీట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనసైనికులు రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. నిజానికి ఆ ట్వీట్ సన్నీలియోన్ ది కాదని ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆమె ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ఉంటుంది. అది అఫీషియల్ అకౌంట్! కానీ.. సన్నీలియోన్ పేరుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ లో బ్లూ టిక్ లేదు. దీంతో సన్నీలియోన్ పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ నిజం కాదని, అసలు ఆమె ఈ వ్యవహారం పట్ల స్పందించలేదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.