గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా నెల్లూరు లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బారా షాహిద్ దర్గా దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటు అనిల్ వర్గీయులు, ఇటు కోటంరెడ్డి వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో నెల్లూరు వైసీపీ నేత, అనిల్ వర్గం నాయకుడు సమీర్ ను కోటంరెడ్డి వర్గీయులు కత్తితో పొడిచారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. బారా షాహిద్ దర్గా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదగొట్టి అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇక కత్తిపోట్లకు గురైన సమీర్ ఖాన్ ను హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆసుపత్రికి చేరుకుని సమీర్ ను పరామర్శించారు. అయితే గత కొద్దిరోజులుగా బారా షాహిద్ అభివృద్ధిపై ఇరు వర్గాల మధ్య వాదనలు జరుగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం అభివృద్ధిపై ఇరు వర్గాలు చర్చకు దిగాయి. అందులో భాగంగానే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.