ఇంకో రెండు రోజుల్లో చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలవుతుంది. ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అయితే ఏపీలో చిరు ఫ్యాన్స్ కి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కొంతమంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
ఇప్పటి వరకూ రాజకీయాల గురించి మాట్లాడని మెగాస్టార్ చిరంజీవి.. మొదటిసారిగా మాట్లాడారు. అది కూడా ఏపీ ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై కామెంట్స్ చేశారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా చిరంజీవి కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి హీరోల రెమ్యునరేషన్ గురించి ఎందుకని చిరంజీవి అన్న కామెంట్స్ కి వైసీపీ నేతలు బదులు చెబుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇవే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. దీంతో గుడివాడలో చిరంజీవి అభిమానులు ఆందోళన చేపట్టారు.
జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. చిరంజీవికి కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, చిరు అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి సహా పలువురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో చిరు అభిమానులు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ప్రస్తుతం గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఈ రాద్ధాంతానికి కారణం.. చిరు వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేయడమే. హీరోల రెమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి.
పిచ్చుకపై బ్రహ్మస్త్రంలా ఇండస్ట్రీ మీద ఎందుకు పడడం.. మీ లాంటి నాయకులు ప్రత్యేకహోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీసుకురావడం గురించి ఆలోచించాలి గానీ మా గురించి, ఇండస్ట్రీ గురించి ఎందుకు అని అన్నారు. ఇవే ఇప్పుడు వైసీపీ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో చిరు మీద వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చిరు ఫ్యాన్స్ కి కోపం తెప్పించాయి. వాస్తవానికి కొడాలి నాని చిరు పేరు ప్రస్తావించి ఎక్కడా కూడా విమర్శించలేదు. కానీ పరోక్షంగా చిరుని అన్నట్టే ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుకి క్షమాపణలు చెప్పాలి అన్న ఫ్యాన్స్ డిమాండ్ ని కొడాలి నాని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? చూడాలి.