బోరుగడ్డ అనిల్ కుమార్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరిది. హద్దు, అదుపులేని బూతులతో పక్క పార్టీల నాయకులపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోతూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానిని అని చెప్పుకుంటూ ఇతర పార్టీల నాయకులపై బూతులు మాట్లాడటం రాజకీయాల్లోనే కాదు.. సామాన్య జనంలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ ఎవరీ బోరుగడ్డ అనిల్? పక్క పార్టీ నాయకులపై అంత తీవ్ర స్థాయిలో బూతులు ప్రయోగించాల్సిన అవసరం ఏముంది? నిన్న ఆయన కార్యాలయానికి గుర్తు తెలియని వక్తులు నిప్పు పెట్టడానికి ఆయన బూతులే కారణమా?..
బోరుగడ్డ అనిల్ గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నేత. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. అనిల్ తనను తాను వైఎస్ జగన్ వీరాభిమానిగా చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే వారిపై బూతులతో విరుచుకుపడుతూ ఉంటారు. గతంలో పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై ఇప్పటికీ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కేవలం పవన్ కల్యాణ్‌పై మాత్రమే కాదు.. చంద్రబాబు, లోకేష్‌లపై కూడా రెచ్చిపోయారు. మొన్న ఈ మధ్య కోటంరెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ గురించి మాట్లాడితే కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డున ఈడ్చుకు వస్తానని కోటంరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని ఆయన కార్యాలయానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
బోరుగడ్డ అనిల్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఎన్ని జరిగినా ఆయనలో మార్పు రావటం లేదు. ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోతున్నారన్నది ప్రతిపక్షాల వాదన. తాను ఫేమస్ కావటానికి, జగన్ దృష్టిలో పడటానికే బూతులు ఎంచుకున్నాడని కూడా అంటున్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్, కోటంరెడ్డి లాంటివారిపై బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలకు బాధ పడ్డ వారి అభిమానుల్లో కొంతమంది.. అనిల్ కార్యాలయానికి నిప్పు పెట్టి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.