ఆయేషా మీరా హత్య కేసు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. సుమారు 15 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనలో.. పిడతల సత్యం బాబును నిందితుడిగా తేల్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2017లో కోర్టు.. సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించి.. విడుదల చేసింది. అనంతరం సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తుపై ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ బిడ్డ హత్య జరిగి 15 ఏళ్లు గడిచినా.. సరే.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డ అత్యంత దారుణంగా హత్యకు గురికాగా.. ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లు.. బయట దర్జాగా తిరుగుతున్నారని.. తాము మాత్రం గుండెకోతను భరిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడలో ఆయేషా మీరా హత్య కేసుపై.. ఆమె తల్లిదండ్రులు, మరి కొందరు కలిసి ‘ఇంకెన్నాళ్లు’ పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయేషాను హత్య చేసిన నిందితులకు శిక్ష పడేదాకా తమ పోరాటం ఆగదని.. ఈ క్రమంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని స్పష్టం చేశారు. అవసరమైతే.. తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అసలైన దోషులకు శిక్ష పడి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అంతేకాక.. కావాలనే.. ఈ కేసును తప్పు దోవ పట్టించారని వారు ఆరోపించారు.
2018 డిసెంబరులో కేసు సీబీఐకి అప్పగించారని ఆయేషా తల్లి గుర్తు చేశారు. ఆ తర్వాత.. తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయించారని తెలిపారు. అంతేకాక తమ దగ్గరున్న వివరాలన్నీ సీబీఐకి అందజేశామన్నారు. ఇక తమ మత పెద్దలు నాడు రీ పోస్ట్ మార్టంకు అంగీకరించకపోయినా.. కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చి మరీ.. రీ పోస్ట్ మార్టం చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే పోస్టుమార్టం పూర్తి చేసి నాలుగేళ్లైనా ఇంతవరకు దానికి సంబంధించిన నివేదిక అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసును బైఫర్ కేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. సీబీఐ కూడా కేసును సరిగా పట్టించుకోవడం లేదని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో నిర్భయ తరహాలో ఆయేషా పేరుతో చట్టం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అంతేకాక నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని ఆమె కోరారు. ఇక ఆయేషా హత్యపై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజా సంఘాలు కూడా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని.. సీఎం జగన్.. ఆయేషా కేసులో దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు.
2007 డిసెంబరు 7 విజయవాడలోని దుర్గా లేడీస్ హాస్టల్‌లో ఆయేషా మీరా హత్య జరిగింది. అప్పుడుఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతోంది. తన గదిలో ఉన్న ఆయేషాను బయటకు తీసుకువచ్చి బాత్ రూంలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అత్యాచారం కూడా జరిగన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింద. అప్పట్లో ఓ మంత్రి కుమారుడు ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ చివరకు అనూహ్యంగా.. పిడతల సత్యం బాబును నిందితుడిగా తేల్చిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కోర్టు 2017లో అతడిని నిర్థోషిగా ప్రకటించింది. అనంతరం ఈ కేసు విచారణను సీబీఐ మొదలు పెట్టింది. కానీ సీబీఐ తీరుపై ఆయేషా తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసులో అసలు నేరస్తులు దొరుకుతారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.