ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ కొనసాగుతుంది. పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.
ఇదిలా ఉంటే.. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. పీఆర్సీ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు చెబితే అప్పుడు సమ్మె చేపట్టి బస్సుల్ని ఆపేస్తామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలతో ఆర్టీసీ ఉద్యోగులకూ నష్టమేనని… పీఆర్సీ సాధన సమితి సూచనల మేరకు సమ్మెలోకి వెళ్లడానికి సిద్దమని స్పష్టం చేశారు. వచ్చే నెల మూడో తేదీన ఛలో విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : అనుమానాస్పద స్థితిలో మాజీ సీఎం మనవరాలు మృతి!
ఆర్టీసీకి విలీనం కాకముందే మాకు నాలుగేళ్లకోసారి పీఆర్సీ వచ్చేది.. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల పదేళ్లకోసారి పీఆర్సీ వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అసలు తాము విలీనం ఎందుకు కోరుకున్నామా అని బాధపడుతున్నామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. అసలు విలీనానికి ఎందుకు అంగీకరించామా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పీఆర్సీ పోరాట సమితి చెబితే.. ఏ క్షణమైనా.. అర్ధరాత్రి అయినా సరే బస్సుల్ని ఆపేస్తామని చెప్పుకొచ్చారు.