ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సేవలను అందుబాటులోకి తెస్తోన్న ఏపీఎస్‌ఆర్టీసీ.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ వివరాలు..
నేటి కాలంలో ప్రయాణాలు నిత్య జీవితంలో భాగం అయ్యాయి. ఇంట్లో కూర్చుంటే గడిచే రోజులు కావు. ఉద్యోగం, పని నిమిత్తం నిత్యం బయట తిరుగుతుంటాం. దగ్గర ప్రాంతాలకు ప్రయాణం అయితే సిటీ బస్‌లు, బైక్, ఆటో ఇలా అందుబాటులో ఉన్న దాన్ని ఎంచుకుని గమ్య స్థానాలకుచేరతాం. కానీ దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే బస్సు, రైలు ఉత్తమం. ఇక పండగలు, శుభకార్యాల వేళ ఆర్టీసీనే బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు జనాలు. రద్దీని దృష్టిలో పెట్టకుని.. ఆర్టీసీ సంస్థ కూడా అనేక రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇక తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుని.. దేశంలోనే తొలిసారి అనే రికార్డు సృష్టించింది. ఈ సరికొత్త నిర్ణయం వల్ల ప్రయాణికులకు ఎన్నో లాభాలు ఉండనున్నాయి. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అంటే..
ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ముందుగానే బస్ టికెట్లను బుక్ చేసుకుంటాం. అదే రెండు, మూడు స్టాప్‌లలో దిగి.. మరో బస్ ఎక్కాలంటే ఇలా రిజర్వేషన్ సదుపాయం ఉండదు. ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ఓ వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
దీనిలో భాగంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు ఒక బస్సు నుంచి ఇంకో బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల సమయం ఉంటుంది. ఈ విధానాన్ని తొలుత 137 బస్ రూట్లలో అమలు చేస్తారని తెలిపారు. ఇందుకోసం యూటీఎస్ ఆన్ లైన్ యాప్ ద్వారా గాని, ఆర్టీసీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కానీ రిజర్వేషన్ చేసుకోవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకువస్తున్న సంస్థగా ఏపీ ఆర్టీసీ రికార్డ్ కెక్కనుంది.
ముందు కొన్ని ప్రాంతాల్లో దీన్ని అమలు చేసి.. ప్రయాణికులు స్పందనను బట్టీ ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే పలు కొత్త పథకాలు, ఆఫర్లను తీసుస్తుంది. దీనిలో భాగంగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అమలు చేస్తున్నది. ఇప్పుడు మరిన్ని కొత్త విధానాలతో ప్రయాణికులకు మరింత చేరువ కాబోతుంది. మరి ఏపీఎస్‌ఆర్టీసీ తీసుకున్న మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ సేవల వల్ల లాభం ఉంటుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.