చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం రాయలచెరువు వరద నీటి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిరుపతి శివార్లలోని రాయలచెరువు కట్ట తెగిపోయే ముప్పు ఉండటంతో దాదాపు 40 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. చెరువు కట్ట నీరు లీకేజీ అవుతుండటంతో.. రాయలచెరువు దిగువనున్న గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో పశువులను తోలుకుని కొండ ప్రాంతాలను చేరుకుంటున్నారు.
రాయలచెరువు గ్రామం, కాలేపల్లి, చిట్టలూరు, గొల్లపల్లి, సూరవారిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు నిన్న సాయంత్రానికే వరద చేరింది. చెరువు నిండు కుండలా ఉంది. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ వెంకట అప్పల నాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాయల చెరువు పరిశీలనకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు పర్యటనతో భారీగా పోలీసు అలర్ట్ అయ్యారు. రాయల చెరువు ను రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు.
గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆయన కాన్వాయ్ వెళ్తే భద్రత ఉండదని.. ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు అన్నట్లు సమాచారం. చంద్రబాబుకు తాము భద్రత కల్పించలేమని.. అందుకే పర్మిషన్ నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో రాయల చెరువు వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓ వైపు వరద బాధితులు కష్టాలు పడుతుంటే.. అధికార పార్టీ మాత్రం ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.