కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రద్ధాసక్తులతో తిరుమల కొండకు చేరుకుంటారు. అలాంటి కొండ మీద ఉగ్రవాదులు ఉన్నారనే వార్తలు సంచలనం రేపాయి.
తిరుమలలో టెర్రరిస్టులు ఉన్నారనే వార్తలు సంచలనం రేపాయి. ఉగ్రవాదులు ఉన్నారనే ఈమెయిల్‌తో అలర్ట్ అయిన పోలీసులు.. భారీగా బందోబస్తు పెంచి, తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే చివరికి అది ఫేక్ మెయిల్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారని వచ్చిన ఈమెయిల్ ఫేక్ అని.. టెర్రరిస్టులు సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవని చెప్పారు. అసత్య ప్రచారాలను భక్తులు అస్సలు నమ్మొద్దని ఆయన సూచించారు. తిరుమలలో అన్ని వేళలా భద్రత పటిష్టంగా ఉందని.. ఎలాంటి అనుమానాలు వద్దని పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇకపోతే, తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పోలీసులకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ చేశారు. దీంతో పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంకన్న ఆలయ పరిసరాలతో పాటు మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీని కూడా నిశితంగా పరిశీలించారు. మెయిల్లో వచ్చిన సమాచారం మేరకు తిరుమలలో అంతా జల్లెడ పట్టారు. అయితే మెయిల్లో సూచించిన సమయంలో ఆ ప్రదేశంలో ఎలాంటి సంచారం లేదని గుర్తించారు. ఈమెయిల్ పంపిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. కాగా, ఇటీవల తిరుమల కొండ మీద ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం కలకలం రేపింది. హెచ్‌టీ కాంప్లెక్స్ దగ్గర కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద కత్తులతో వీరంగం సృష్టించారు.