అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకతాయిలు ఏదో రకంగా ఏడిపిస్తుంటారు. అయితే వారి ఆట కట్టించడానికి ఓ అమ్మాయి చేసిన పని చూస్తే మిగతా అమ్మాయిలు కూడా ఇలా అలర్ట్ అవ్వాలనిపించేలా ప్రవర్తించింది.
ఆపదలో ఉన్న ఆడవారి రక్షణ కోసం ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో దిశ యాప్ ఒకటి. ఈ యాప్ ఎంతోమంది మహిళలకు అండగా ఉంటోంది. ఒంటరి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ కల్పిస్తారు. వారిని రక్షిస్తారు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళకు రక్షణ కల్పించారు. అసలు జరిగిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అమలాపురం మోబర్లీపేటలోని ఓ ఆయిల్ దుకాణంలో ఒక యువతి వర్క్ చేస్తుంది. ఆదివారం రాత్రి 8.15 నిమిషాల టైంలో షాప్‌కు వచ్చిన వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి వెంటనే దిశ SOSకు సమాచారం అందించింది. కేవలం రెండు నిమిషాల్లోనే పోలీసులు ఆమె ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. యువతితో గొడవ పడుతూ కనిపించిన బొక్క భాను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అతనికి ఐపీసీ సెక్షన్ 354 A, 506, 509ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనికి బాధిత మహిళ మాట్లాడుతూ.. తను కాల్ చేసి రెండు నిమిషాల వ్యవధిలోనే దిశ టీం రావడం.. పోలీసుల పనితీరు అద్భుతమని తెలిపింది. ఓ వ్యక్తి వచ్చి తనతో అలా ప్రవర్తిస్తుంటుంటే ఏం చేయాలో తోచలేదని.. తన మొబైల్‌లో ఉన్న దిశ sos యాప్‌కు కాల్ చేసినట్లు తెలిపింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రతి యువతి దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది. తనలాగ ఏ అమ్మాయి అయినా ఇబ్బందులు పడుతుంటే వారికి ఈ యాప్ రక్షణ కల్పిస్తుందని చెప్పింది. ఈ సందర్భంగా.. మహిళల పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తిస్తే చట్ట రీత్యా కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.