ఈ మద్య కాలంలో దొంగలు చాలా తెలివి మీరారు.. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. తెలివిగా తప్పించుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో దొంగలు తెలివిగా చోరీలకు పాల్పపడుతున్నారు. ఉదయం రక రకాల వేషాల్లో తిరుగుతూ.. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి దోచేస్తున్నారు. వేసవి కాలంలో దొంగలు రెచ్చిపోతారన్న విషయం తెలిసిందే. వేసవి కాలం కావడంతో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళతారు. ఇదే అదునుగా ఊరెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుల్ల చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఒక ఘటన జరిగింది. ఒక పాల వ్యాపారి పక్క పథకం ప్రకారం దొంగతనాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కైపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏఏఏ అపార్ట్ మెంట్ లో ప్రసాద్, ఉషారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారు వృత్తిరీత్యా టీచర్లు. గత నెలలో 20వ తేదీన ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లి… తిరిగొచ్చి చూస్తే ఇల్లు అంతా చిందరవందరగా ఉండటంతో తమ ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించారు. వెంటనే ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. అయితే దొంగతనానికి ముందు పాల వ్యాపారి అక్కడ తచ్చాడుతూ కనిపించాడు. దీంతో పాల వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.
గతంలో కూడా పాలు పోసిన రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ఈ మూడు చోరీలకు సంబంధించి… మొత్తం 21 తులాల బంగారం, 62 తులాల వెండి ఆభరణాలు, రూ. 2.48 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నింటి విలువ రూ.14.49 లక్షలు అని పోలీసులు వెల్లడించారు. యర్రి స్వామి చోరీ చేసిన సొత్తును అమ్మి ఆవులను, ఒక కెమెరాను కొనుగోలు చేయాలని పథకం వేశాడు. హైదరాబాద్ వెళ్లాలను కున్నాడు. అదే సమయంలో పోలీసులు కాపుకాపి అతనిని పట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం పూట పాల వ్యాపారం చేస్తూ.. ఆ తర్వాత ప్లాన్ చేసి పాలు పోసే ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపాడు.