గత కొంత కాలంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ చిన్న విషయం దొరికినా అధికార పక్షంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్ష నేతలు పనికట్టుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ కేసుకు సంబంధించిన ఒక ఫైల్ నెల్లూరు కోర్టులో దొంగలు ఎత్తుకు పోవడం పై దుమారం చెలరేగుతుంది. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. జ్యూడిసీయల్ విచారణకు కూడా తాను సిద్దంగానే ఉన్నానని.. కోర్టులో జరిగిన చోరీకీ తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హైకోర్టుకు వెళ్లొచ్చని, లేదా సీబీఐతో విచారణ జరిపించుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ఎక్కడికైనా వస్తానని అన్నారు. కావాలని దీనిని ఎవరో దురుద్దేశ పూర్వకంగా చేసినట్లు అనుమానం వస్తుందని అన్నారు.
ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నాను.. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. తనపై ఎలాంటి అభియోగాలు ఉన్నా వాటిని నివృతి చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. కాకపోతే ఈ కేసును అసలు తాను పట్టించుకోవడం లేదన్నారు. కోర్టులో చోరీని తానే చేయించి ఉంటే ఆధారాలను తాను అక్కడే వదిలివెళ్లేలా చేస్తానా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు.