ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టంతో పాటు సీఆర్డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి.. వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని కోర్టు వెల్లడించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాద ప్రతివాదనలను శుక్రవారం పూర్తి చేయడంతో ఈ వ్యాజ్యాలన్నింటిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.