ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే మహిళల ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరొక శుభవార్త చెప్పింది.
ఇటీవలే మహిళల ఖాతాల్లో రూ. 15 వేలు చొప్పున జమ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక శుభవార్త చెప్పింది. ప్రస్తుతం సముద్రంలో చేపల పునరుత్పత్తి కారణంగా వేట నిషేధం అమలు చేస్తారు. దీంతో మత్స్యకారులకు వేట విరామం దొరుకుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలబడాలని భావిస్తోంది. వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 వేలు ఇస్తోంది. గడిచిన నాలుగేళ్లలో 4.14 లక్షల మందికి రూ. 414.49 కోట్ల భృతిని అందించిన ఏపీ ప్రభుత్వం ఈసారి కూడా మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించనుంది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 10 వేలు చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి అర్హులను గుర్తించే ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. మత్స్య సహాయకుడు, వాలంటీర్, సాగరమిత్ర టీములు తీరంలో లంగరు వేసిన బోట్లను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఈ నెల 18న గ్రామ సచివాలయంలో డేటాలో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆరు దశల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం అర్హుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతారు. ఈ కేంద్రాల్లో తమ పేరు ఉందో లేదో అర్హులు తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పథకం కింద ఎవరైనా అనర్హులుగా ఉంటే వారి అభ్యంతరాలు తెలపచ్చు. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాత అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు. ఈ నెలాఖరులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు మత్స్యశాఖ కసరత్తు చేస్తోంది.
మే నెల రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సముద్రంలో 61 రోజుల పాటు నిషేధం అమలులో ఉందనున్న నేపథ్యంలో ఈ భరోసా ఇవ్వనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. దీంతో పడవలన్నీ సముద్రం ఒడ్డుకు చేరుకోనున్నాయి. ఇక ఈ భరోసాతో పాటు డీజిల్ సబ్సిడీని కూడా రూ. 6.03 నుంచి రూ. 9కి పెంచింది ప్రభుత్వం. మరి ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.