ఏపీలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు జగన్ సర్కార్ వరుసగా శుభవార్తలు తెలుపుతుంది. వచ్చే నెల నుండి అమలు అవుతున్న రెండు విషయాలను ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజలకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్ సర్కార్ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించుటకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లలు చదువుకునే దగ్గర నుండి వివాహం చేసుకునే వరకు ‘అమ్మఒడి’, ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన, ‘వైఎస్ఆర్ కల్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ వంటి అనేక పథకాల ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. సెప్టెంబర్ నుండి ఫోర్టిఫైడ్ రైస్ రేషన్ కార్డుదారులకు అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. దీని పూర్తి వివరాల్లోకి వెలితే..
ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వరుసగా తీపి కబురులు తెలిపారు. అన్ని జిల్లాల్లో పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం అందజేస్తామన్నారు. ఈ బియ్యంలో ఐరన్, పోలిక్ ఆమ్లం, బి12 ఉంటాయని, వీటి వలన రక్త హీనత నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను సాధారణ బియ్యంలో 1:100 నిష్పత్తిలో మిక్స్ చేయడం వల్ల పోషక విలువలు అందుతాయని, ఇవి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యకరం అని మంత్రి అన్నారు. పోషకాలతోపాటుగా విటమిన్స్ కూడా అందుతాయని తెలిపారు.
ఈ బియ్యంపై కొందరు ప్లాస్టిక్ బియ్యం అని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్ట్‌గా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అందజేస్తున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో సరఫరా చేస్తామన్నారు. ఈ రైస్ పంపిణీ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందున్నారు. ఈ నెల నుండి ఐసీడీఎస్ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు మూడు కిలోల పోషక బియ్యాన్ని ‘ఇంటికే రేషన్ పథకం’ కింద పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించుటకు పోస్టర్లతో, ప్రముఖ క్రీడాకారణి పీవీ సింధుతో వీడియో కూడా రూపొందించి ప్రచారం చేస్తున్నామన్నారు.
దీనితో మరో శుభవార్త తెలిపారు మంత్రి. ఫోర్టిఫైడ్ బియ్యతోపాటుగా రేషన్ షాపుల్లో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన గోధుమపిండి కూడా ప్రజలకు సరఫరా చేస్తామన్నారు. దీనికి సంబంధించిన టెండర్లను పిలువబోతున్నారని తెలిపారు. వీటితో పాటుగా రాగులు, జొన్నలు కూడా రేషన్ షాపుల్లో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైస్‌ని కొందరు ప్లాస్టిక్ బియ్యం అని అపోహలు సృష్టిస్తున్నారు. అలాంటి అపోహలు తొలగించుటకు డెమో కూడా అందరికి చూపించారని మంత్రి చెప్పుకొచ్చారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతోపాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోర్టిఫైడ్ రైస్‌ను అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దళారీలకు ఆస్కారం లేకుండా ఈ బియ్యాన్ని డైరెక్ట్‌గా రైతుల దగ్గర సేకరించాలని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వివరించారు.