ఒక్పప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యి.. లేదంటే పిడకలు వాడేవారు. ఇక వర్షాకాలంలో చూడాలి ఆడవారి తిప్పలు. కట్టెలు, అప్పుడప్పుడు పొయ్యి కూడా తడిచి.. వంట చేయడానికి నాకా ఇబ్బందులు పడేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు అలవాట్లు, పద్దతులు, పరికరాలు మారాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు అరుదు. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ పొయ్యిలే దర్శనం ఇస్తున్నాయి. దీనివల్ల ఆడవాళ్లకు పని సులువు అయ్యింది.. పొగ వల్ల వచ్చే ఇబ్బందులు తప్పాయి. అయితే గ్యాస్ సిలిండర్ వాడుతున్న వేళ.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే.. పెను ప్రమాదాలు తప్పదు.
తాజాగా గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం లింగాపురంలో శనివారం (నవంబర్ 5) సాయంత్ర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజగోపాల్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఎలా లీకయ్యిందో తెలియదు కానీ.. గ్యాస్ లీక్ అయ్యింది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రాజగోపాల్ లైట్ వేశాడు. కానీ అప్పటికే గుప్పున వాసన వచ్చింది. పరిస్థితి అర్థం అయ్యింది. వెంటనే అప్రమత్తమయ్యి.. ఇంట్లోని వారందరిని బయటకు పంపేశాడు.
ఈ లోగా రాజగోపాల్ ఇంట్లో క్షణాల్లో పెద్ద పేలుడు చోటు చేసుకుంది. ఆ ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇల్లు ధ్వంసమైంది. లోపల ఉన్న సామానంతా చెల్లాచెదురైంది. ఇక ప్రమాదం గుర్తించిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని.. మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకున్నారు. ఇరుగుపొరుగువారు వచ్చి.. మంటలు ఆర్పి.. ఇతర ఇళ్లకు వ్యాపించకుండా చూడటంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీకైందా.. లేదా వెలిగించిన స్టవ్ ఆరిపోతే, ఇంట్లో వాళ్లు చూసుకోలేదదా అనే విషయం తెలియాల్సి ఉంది. గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. గ్యాస్ లీకవుతున్న విషయాన్ని గుర్తించి, రాజగోపాల్ తన కుటుంబ సభ్యులను తీసుకొని ఇంటి బయటకు వచ్చేశారు. కాసేపటికే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు.