ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. ఇప్పటికీ కొన్ని చోట్లు ప్రజలు మూఢ విశ్వాసాలను నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటికీ ఎంతో మంది మూఢ విశ్వాసాలు నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ దొంగ బాబాలను నమ్ముతు సర్వం కోల్పోతున్నారు. దుష్ఠశక్తులు తమ గ్రామాల్లో తిష్టవేశాయని మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి.
అనంతపురం గుత్తి మండలానికి చెందిన ఎర్రగుడి గ్రామంలో ప్రజలు ఇంకా మూఢ విశ్వాసాలు నమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ ఊరి ప్రజలు అంతగా భయపడుతున్నారంటే.. ఒక మహిళ చేసిన విచిత్రమైన పనే కారణం. ఆ మహిళ చేసిన పని వల్ల తమ గ్రామంలో వరుసగా జనాలు చనిపోతున్నారని గ్రామస్థులు గట్టిగా నమ్ముతున్నారు. ఇంతకీ ఆ మహిళ చేసిన పని ఏంటంటే.. తన భర్త కొంత కాలంగా తనను దారుణంగా హింసిస్తున్నాడని.. తన అలవాట్లు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని.. దాంతో ఆమె భర్త బతికి ఉండగాను విధవరాలిగా మారింది.
ఇది కేవలం తన భర్తకు బుద్ది వచ్చేందుకు మాత్రమే చేశానని.. ఇందులో ఏలాంటి మర్మం లేదని ఆ మహిళ అంటుంది. అయితే ఆమె అలా విధవరాలిగా మారిన తర్వాత విచిత్రంగా గ్రామంలో వరుస మరణాలు సంబవిస్తున్నాయి. ఆ మరణాలు విచిత్రంగా ప్రతి నెల 23 న జరుగుతున్నాయి. దీంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన గ్రామస్థులు ఓ పూజారిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ఊరికి అరిష్టం పట్టిందని.. భర్త ఉండగానే మహిళ చేసిన పనికి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని పూజారి చెప్పడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు.
గ్రామస్థులు వెళ్లి ఆ మహిళను ముత్తయిదువుగా తయారు కమ్మని చెప్పారు.. కానీ ఆమె మాత్రం తన భర్త మారేంత వరకు అలాగే ఉంటానని, ఇంకా బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చేసింది. ఇలాగే ఉంటే ఊరిలో మరెన్నో ప్రాణాలు పోతాయని భావించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి భర్త విషయం తాము చూసుకుంటామని చెప్పి మహిళ వైధవ్యాన్ని విరమించేలా చేశారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మవొద్దని గ్రామస్థులకు తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.