అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తల జీవితాల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లు తోడుగా ఉంటాడనుకున్న తన భర్త లోకం విడిచి వెళ్లాడు. దీంతో ఆమె విషాదంలో మునిగిపోయింది.
ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు. ఇదే క్రమంలో ఆనందంగా సాగుతున్న ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. భర్త అనారోగ్యానికి గురై తనువు చాలిస్తే అన్నీతానై ముందుకు నడిచింది ఆ భార్య. నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన తన భర్త ఆమెను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు. పుట్టెడు దుఖాన్ని దిగమింగుకుని ఆమె భర్త అంత్యక్రియలను నిర్వహించింది. తలకొరివి పెట్టేందుకు కొడుకులు లేకపోవడంతో తానే తలకొరివి పెట్టి భార్యాభర్తల బంధానికి ఆదర్శంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని హిరమండలం మేజర్ పంచాయతీ చిన్నకోడార వీదికి చెందిన నగరపు శంకర్రావు, రోహిణి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి మాధురి, అనురాధ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆనందంగా సాగుతున్న వారి జీవితాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా శంకర్రావు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో కడుపు నొప్పి భరించలేక శంకర్రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలకు బంధువులు ఎవరు రాకపోవడంతో.. లోకంలో ఏ భార్యకు రాని కష్టం ఆమెకు వచ్చింది. ఐదోతనం పోగొట్టుకుని దుఖంలో మునిగిపోయిన భార్య రోహిణి తన భర్త అంతిమసంస్కారాలను నిర్వహించింది. మగ సంతానం లేకపోవడంతో తానే తలకొరివి పెట్టి భార్యగా తన కర్తవ్యాన్ని చాటుకుంది. చితికి నిప్పుపెట్టి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ విషాద ఘటన ప్రతిఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది.