ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాక్సీ భార్య వినీ రామన్ శ్రీమంతం వేడుక ఘనంగా జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక విశిష్టత ఉంది. అందుకే పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సైతం భారత సంప్రదాయాలను పాటించేందుకు మక్కువ చూపుతుంటారు. ఇక క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లేందరో.. నెలల తరబడి భారత్‌లోనే మకాం వేస్తున్నారు. ఈ క్రమంలో మన ఆహారాన్ని వంట పట్టించుకోవడమే కాక.. ఆచారాలను కూడా పాటిస్తున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అయితే.. భారతీయతకు ముగ్దుడయ్యనని పలుమార్లు ప్రకటించాడు. భారత్ పై తనకున్న ప్రేమకు గుర్తుగా.. తన కూతురికి ‘ఇండియా’ అని పేరు పెట్టాడు. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అయితే మరో అడుగు ముందుకేసి భారత అమ్మాయినే వివాహమాడాడు.
చెన్నైకి చెందిన వినీ రామన్‌ను గతేడాది మ్యాక్స్‌వెల్ పెళ్లాడాడు. వీరి పెళ్లి హిందూ సంప్రదాయంలో ధూం ధాంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మరింత భారతీయుడిగా మారిపోయిన మ్యాక్స్‌వెల్ మన సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మ్యాక్సీ భార్య వినీ.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సెప్టెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం వినీ శ్రీమంతం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ప్రముఖుల బేబీ షవర్ (శ్రీమంతం) వార్తలు బాగా ప్రాచూర్యం పొందుతుంటే.. వినీ మాత్రం శ్రీమంతంలో తన కట్టు బొట్టుతో ఆకట్టుకుంది. పట్టు చీర, బంగారు నగలతో ముస్తాబైన వినీకి.. మ్యాక్స్‌వెల్ సహా కుటుంబ సభ్యులు సంప్రదాయ బద్దంగా శ్రీమంతం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను వినీ ఇన్‌స్టా, ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘చిన్నారికి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలకడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చింది. గతంలో ఓ సారి కడుపులోనే పాప చనిపోయినట్లు ప్రకటించిన వినీ.. రెయిన్ బో బేబీ కోసం ఇప్పటి నుంచే షాపింగ్ చేస్తున్నట్లు పలుమార్లు తెలిపింది. మరి మ్యాక్స్‌వెల్ ఇంట భారతీయ సంప్రదాయాలతో శ్రీమంతం జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.