ఆయన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు. నెల అయితే చాలు.. రూ. లక్షల్లో జీతం వచ్చి పడుతుంది. అయినా అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ఉద్యోగంలో భాగంగా విదేశాల్లో ఉన్న మనసంతా సొంతూరిపైనే ఉండేది. అందుకే చివరకు లక్షల జీతం వదులుకుని వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీరు.
నేటి సమాజంలో ప్రతి యువకుడికి ఎదురయ్యే ప్రశ్నలు “ఉద్యోగం చేస్తున్నావు?, జీతం ఎంత? “. ఈ ప్రశ్నల దెబ్బకు ఊర్లో పొలం ఉన్నా కూడా ఉద్యోగం కోసం ఎందరో యువకులు పట్టణాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తుంటారు. ఏదో ఒక జాబ్ వస్తే చాలు దేవుడా! అని అనుకుంటారు. అందులోను ప్రస్తుతం ఉద్యోగాలు దొరకడం అనేది చాలా గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష జీతం వస్తున్న వాళ్లు ఎవరైనా ఉద్యోగాన్ని వదిలేస్తారా?. వదలరు అనే సమాధానం వస్తుంది. అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అందరూ వ్యవసాయాన్ని వదలి.. నగరం వెళ్తుంటే.. ఆ వ్యక్తి మాత్రం లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదలి కాడి పట్టాడు. వినూత్న పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ సాఫ్ట్ వేర్ రైతు సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయన పేరు బాలభాస్కర్ శర్మ.. అతడి కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం. ఆయనకు 8.5 ఎకరాల పొలం ఉంది. బాలభాస్కర్ ఎంటెక్ పూర్తి చేసి.. 2011లో సింగపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా చేరారు. నెలకు లక్షల్లో వచ్చే జీతంతో జీవితాన్ని ఆనందంగా గడిపేవారు. అయితే ఈక్రమంలోనే కరోనా మహమ్మారి వచ్చి అనేక మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కరోనా కారణంగా శర్మ వాళ్ల తండ్రి మదన గోపాల్ శర్మ చనిపోయాడు. దీంతో బాలభాష్కర్ శర్మ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.
ఇదే సమయంలో ఓ ఆలోచన తనలో మెదిలింది. కన్న వారిని, జన్మభూమిని వదలి ఇక్కడ లక్షలు సంపాదించిన తృప్తి ఉండదని భావించారు. తమకున్న భూమిలో రకరకాల పంటలు పండిచండం ద్వారా ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి తోడుగా నిలబడ వచ్చని భావించారు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికలు రూపొందించుకున్న భాస్కర్ శర్మ 2020లో స్వదేశానికి తిరిగి వచ్చారు. తన గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో పంటలు సాగు చేయడం ప్రారంభించారు. గత మూడేళ్లుగా వ్యవసాయంపైనే దృష్టి సారించారు.
వ్యవసాయంతో పాటు సాఫ్ట్ వేర్ వృతిని కొనసాగిస్తుండటం విశేషం. తన పొలంలో మామిడి, జామ, నేరేడు ,సీతాఫలం అంజూర, సపోటా,అరటి తోటలు సాగు చేస్తున్నారు. అంతేకాక వీటితో పాటు అంతర పంటగా ఓ 20 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవసాయం కోసం భాష్కర్ శర్మ రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. సేంద్రియ ఎరువులను, మొలకల ద్రావణం వంటి వాటిని పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఆకు కూరలు, కూరగాయల సరఫరా ద్వారా ప్రతి నెలా రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తోందని ఆయన తెలిపారు. అంతేకాక మిగిలిన పంటల దిగుబడులు భాగానే వస్తాయని అన్నారు.
వ్యవసాయాన్ని భారంగా భావించి నగరాలకు వెళ్తున్న యువతకు భాస్కర్ శర్మ ఆదర్శం నిలిచారు. వ్యవసాయానికి నేల తల్లిని ఉపయోగించకపోతే ఆమె అల్లాడుతుందని నమ్మిన వారిలో భాస్కర్ ఒకరు. అన్ని అనుకూలంగా ఉంటే వ్యవసాయాన్నికి మించిన ఉద్యోగం మరొకటి లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లక్షల జీతం వదిలేసి పొలంలోకి దిగిన భాస్కర్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భాస్కర్ శర్మ లక్షల జీతం వదిలేసి వ్యవసాయంలోకి రావడం సరైనాదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి