మెంటర్‌ గా ధోనీ.. గంగూలీ వ్యూహం అదేనా?

ganguly dhoni

అక్టోబర్‌ 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ సెకెండ్‌ హాఫ్‌ జరగనుండగా.. టీ20 వరల్డ్‌కప్‌తో క్రికెట్‌ అభిమానులకు ఇంకో 2 నెలలు ఎంటర్‌టైన్మెంట్‌కి ఢోకా లేదని చెప్పొచ్చు. బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించడంతో అప్పుడే సంబరాలు మొదలైపోయాయి. ఈసారి అన్నిటి కంటే అభిమాలను ఆకర్షించిన అంశం టీమిండియా మెంటర్‌గా కెప్టెన్‌ కూల్‌ని ఎంచుకోవడమే. కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌, మెంటర్‌ ధోనీ, బీసీసీఐ ప్రెసిడెంట్‌ గంగూలీ.. ఇవన్నీ చూసి ఈసారి టీ20 కప్‌ కొట్టడం ఖాయమే అని అప్పుడే అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు.

ఐసీసీ వరల్డ్‌ కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ అందించిన కెప్టెన్‌ కూల్‌.. మెంటర్‌ అవతారం ఎత్తడంతో అసలు గంగూలీ ప్లాన్‌ ఏంటి అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లలో కోహ్లీ టీమ్‌ తేలిపోవడం వల్లే ధోనీని మెంటర్‌ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ధోనీ వ్యూహాలు టీమిడింయా విజయాలకు అడ్వాంటేజ్‌గా ఉంటాయనే మెంటర్‌గా ఎంచుకున్నారంటూ కొందరు చెప్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌ ఫేజ్‌-2 కోసం ధోనీ యూఏఈలోనే ఉన్నాడు. ఐపీఎల్‌ తర్వాత వెంటనే టీ20 కూడా యూఏఈలోనే జరగనుంది. దుబాయ్‌లో ధోనీని కలిసి మెంటర్‌గా వ్యవహరించాలని కోరినట్లు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జేషా తెలిపారు. ధోనీ టీ20 వరల్డ్‌కప్‌కి మాత్రమే మెంటర్‌గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు.

team indiaటీ20 వరల్డ్‌కప్‌ జట్టు ఎంపికపై మరికొన్ని ఆశ్చర్యాలు, ఇంకొన్ని అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు అభిమానులు. జట్టులోకి అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఎంట్రీ చూసి అందరూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, స్పిన్నర్‌ చాహల్‌లను పక్కనపెట్టడంపై కొందరు అసహనం, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ పిచ్‌లపై అశ్విన్‌లాంటి స్పిన్నర్‌ అవసరం ఎంతైనా ఉంటుందని బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అభిప్రాయపడ్డారు. అశ్విన్‌ కచ్చితంగా టీమిండియాకు అదనపు బలంగా మారుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి టీమిండియా స్క్వాడ్‌ని చూసిన వారంతా కప్పు మనదే అంటూ సంబరాలు ప్రారంభించేశారు.