‘హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ’ ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులు పొగడకమానరు. ఎన్నో రికార్డులు హిట్‌మ్యాన్ ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌పై బాదిన శతకంలో విదేశాల్లో అన్ని ఫార్మాటుల్లో శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ. ఇన్ని రికార్డులు ఉన్న హిట్‌మ్యాన్‌ను పొగడటం పెద్ద విశేషం కాదులే అంటారా? పొగిడింది ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ సతీమణి ‘అలీసా హేలీ స్టార్క్’. ఆమె కూడా క్రికెటరే.. ఆస్ట్రేలియా ఉమెన్ టీమ్ తరఫున అలీసా మంచి రికార్డులే ఉన్నాయి.
అలీసా ఆస్ట్రేలియా ఉమెన్ టీమ్‌లో 118 అంతర్జాతీ టీ20లు ఆడి 24.66 బ్యాటింగ్ సగటుతో 2,121 పరుగులు చేసింది. వాటిలో 148 నాటౌట్ హైఎస్ట్ స్కోర్‌గా ఉంది. 79 వన్డేల్లో 1927 పరుగులు చేసింది. హైఎస్ట్ స్కోర్ 133గా ఉంది. ‘వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ చాలా ప్రభావవంతమైన బ్యాట్స్‌మన్. టెస్టుల్లోనూ ఇప్పటికీ రోహిత్ శర్మనే ఉత్తమ ఓపెనర్. అతని స్కిల్స్ నాకు కూడా వస్తే బాగుండు’ అని అలీసా హేలీ స్టార్క్ తెలిపింది. ఇప్పుడు ఆమె పొగిడిన విషయం అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ క్రికెట్ అభిమానుల్లో బాగా వైరల్ అవుతోంది.