కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడి ఫ్యామిలీ గల్లంతు

గుంటూరు- సంక్రాంతి పండగ కోసం షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మిగతా వారు గల్లంతయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఏపీ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి చిన్న కుమారుడు మదన్‌ మోహనరెడ్డికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురును మాచర్ల మండలం కొత్తపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద వదిలిపెట్టారు. మదనమోహన్ రెడ్డి భార్య, పెద్ద కూతురు సుదీక్షతో కలిసి సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనేందుకు విజయవాడ వెళ్లారు.

pinnelli ramakrishna reddy 1

విజయవాడ నుంచి మంగళవారం సాయంత్రం తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు దుర్గి మండలం అడిగొప్పల దగ్గర సాగర్‌ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మదన్‌ మోహనరెడ్డి కారు డోర్ తీసుకొని ఈదుకుంటూ బయటపడ్డారు. భార్య, కూతురును మాత్రం కాపాడుకోలేకపోయారు.

ఈ ప్రమాదం జరిగిన కాసేపటికి అటువైపుగా వెళ్తున్నవారు కారు గల్లంతైన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జలవనరులశాఖ అధికారులతో మాట్లాడి బుగ్గవాగు దగ్గర నీటిని నిలిపి వేయించారు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కారు వెలికితీసేందుకు ప్రత్యేక క్రేన్లతో పాటు, గజ ఈతగాళ్లతో గాలింపు చేయిస్తున్నారు.