భీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుఫాను, ఐదు రాష్ట్రాలకు ముప్పు
తిరువణంతపురం- ఇప్పటికే కరోనాతో జనం అల్లాడిపోతుంటే.. అది చాలదన్నట్లు మళ్లీ తుఫాను ముంచుకొచ్చింది. ఈనెల 14న ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు మాయన్మార్ తౌక్టే గా నామకరణం చేసింది. తౌక్టే శనివారం తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 18 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య గుజరాత్‌లోని పోర్‌బందర్-నలియాల మధ్య తౌక్టే తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటలకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తౌక్టే తుఫాను కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
కేరళ, గోవా, కొంకణ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెలిపింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో తుఫాను తీవ్రత అధికంగా ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కేరళలో శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులకు ఆ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలకు ఇప్పటి వరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కేరళలో పలు ఇల్లు నెలమట్టమయ్యాయి. కేరళకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో తొమ్మిది జిల్లాల్లో 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదువుతుందన్న హెచ్చరికలతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. రెండు రోజుల్లో 145.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. ఇక గుజరాత్, డయ్యూ డామన్‌లో యెల్లో అలర్ట్ జారీ చేశారు. గత ఆరు గంటల నుంచి తాక్టే తుఫాను గంటకు 9 కిలోమీటర్ల వేగంగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం తుఫాను గోవా-పనాజీకి నైరుతి దిశలో 150 కిలోమీటర్లు, ముంబయికి దక్షిణంగా 490 కిలోమీటర్లు, గుజరాత్‌లోని వీరావల్‌కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్లు, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణ ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటల్లో తీవ్ర పెను తుఫానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. సుమారు రెండు రోజుల పాటు తీవ్ర తుఫానుగా పయనించి.. తీరం దాటే సమయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు భారీ వర్షాల నేపధ్యంలో కేంద్రం 100 ఎన్టీఆర్ ఎప్ బృందాలను రంగంలోకి దింపించి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ బృందాలను మోహరించింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని కేంద్రం తెలిపింది.