సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు

న్యూ ఢిల్లీ- అమరావతి భూముల వ్యవహారంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశాక, అందుకోసం సేకరించిన భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఆరోపించింది. ఆ మేరకు అమరావతి భూములవ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని సిట్ దర్యాప్తులో ప్రాధమికంగా తేలింది. ఐతే జగన్ సర్కారు విచారణను ఆపాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఐతే దీనిపై విచారించింన హైకోర్టు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తిరస్కరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐతే ఈ వ్యవహారంలో జగన్ సర్కార్‌కి సుప్రీం కోర్టు షాకిచ్చింది. అమరావతి భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ భూముల వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇన్‌ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది.

cm jagan

అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. అమరావతి భూములకు సంబందించిన ఇన్‍సైడర్ ట్రేడింగ్‍పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత దవే వాదనలు వినిపించారు. అమరావతి భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

2019లో కొత్త ప్రభుత్వం వచ్చాకే ఫిర్యాదులు అందాయని దవే కోర్టుకు తెలిపారు. ఐతే ప్రభుత్వ వాదనలతో ప్రతి వాదులు విభేదించారు. అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఇప్పటివరకు ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని వారు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్నాక ఈ కేసును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.